దిశ హత్యాచార ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ పై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఢిల్లీకి వెళ్లి ..సుప్రీం కోర్టు విచారణకు హాజరై ఎన్ కౌంటర్ కు దారితీసిన పరిస్ధితులు వివరించనున్నారు. ఎన్ కౌంటర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆరోజు పరిస్ధితులు ఏమిటి అనే విషయాలను సజ్జనార్ కోర్టుకు వివరిస్తారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ చేస్తున్న NHRC బృందం సభ్యులు నాలుగోరోజు మంగళవారం విచారించింది. ఎన్ కౌంటర్ లో పాల్గోన్న పోలీసులు NHRC సభ్యులు ప్రశ్నించారు. నిందితులు తమపై దాడి చేసిన విధానాన్ని పోలీసులు వివరించారు. పోలీసులకు తగిలిన గాయాలపై NHRC బృందం వైద్యులను అడిగి వివరాలు తీసుకుంది.
నిందితులు ఒక్కసారిగా తమపై కర్రలు రాళ్ళతో దాడి చేసి రివాల్వర్లు లాక్కున్నారని తెలిపారు. కొంతదూరం పారిపోయిన తర్వాత తమపై కాల్పులకు తెగబడ్డారని..గత్యంతరం లేని పరిస్ధితుల్లో ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని పోలీసులు వెల్లడించారు. ఈవిషయంలో నాలుగు రోజులపాటు విచారణ జరిపిన NHRC బృందం తాము సేకరించిన సమాచారాన్ని బుధవారం డిసెంబర్ 11 న సుప్రీం కోర్టుకు సమర్పించనుంది.