దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యచార కేసులో నిందితుడు, ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన చెన్నకేశవులు భార్య రేణుక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసిన కేసులో చెన్నకేశవులు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. చెన్నకేశవులు ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో రేణుక గర్భవతి. గురువారం మార్చి5 మధ్యాహ్నం రేణుక మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చి చేరింది. శుక్రవారం ప్రసవం జరిగింది. తల్లీ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
చెన్నకేశవులు ఎన్ కౌంటర్ తర్వాత రేణుక విషయం మీడియాలో బాగా వచ్చింది. ఆమె అప్పటికీ మైనర్.. చెన్న కేశవులును ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంతేకాదు.. చెన్నకేశవులు ఎన్ కౌంటర్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ అయ్యాయి.
నా భర్తను కాల్చి చంపారు.. నన్నూ అలాగే కాల్చి చంపండి అంటూ ఆమె పెట్టిన శోకాలు మీడియాలో బాగా ప్రసారమయ్యాయి. భర్త శవం కోసం ఆమె చాలా రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది. చిన్న వయస్సులో పెళ్లి.. అంతలోనే గర్భం. అంతలోనే భర్త చెన్నకేశవులు అనూహ్య పరిస్థితుల్లో మరణం.
హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటనలో నిందితులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, తర్వాత ఆమెను హత్య చేశారు. 2019, నవంబర్ 27న దిశ (పోలీసులు పెట్టిన పేరు)పై శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర గ్యాంగ్ రేప్, హత్య జరిగింది. రెండు రోజుల తర్వాత దిశ హత్యాచారం కేసులో నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండలానికి చెందిన అరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు అరెస్ట్ అయ్యారు. ఘటన జరిగిన రోజున ఆరిఫ్ సహా మరో ముగ్గురు నిందితులు దిశను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి లాక్కుని వెళ్తుంటే ఆమె రక్షించడంటూ కేకలు వేసింది.
ఆమె అరుపులు ఎవరికైనా వినిపిస్తాయనే భయంతో నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు వెంటనే తన జేబులోని మద్యం సీసా తీసి బలవంతంగా ఆమె నోట్లో పోశాడు. అప్పటికే భయపడి ఆందోళనతో ఉన్న దిశ స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత నలుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు.
తర్వాత ఆమెను లారీలోకి ఎక్కించి అందులో మళ్లీ అత్యాచారం చేశారు. మద్యం తాగించి, పాశవికంగా అత్యాచారానికి పాల్పడంతో బాధితురాలు పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమె చనిపోయినట్లుగా భావించి చటాన్‌పల్లి వంతెన దగ్గరకు తీసుకువెళ్లి బతికి ఉండగానే పెట్రోల్ పోసి నిప్పటించారు. 2019 డిసెంబరు 6న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఈ నలుగురూ చనిపోయారు.
కేసు విచారణలో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం వెళ్లిన సమయంలో పోలీసులపై దాడి చేయడంతో.. పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారు. దీనిపై కేసు నమోదు కావడంతో అంత్యక్రియలు 17 రోజులు ఆలస్యమయ్యాయి. డిసెంబర్ 6న ఎన్‌కౌంటర్ జరిగితే.. డిసెంబర్ 23న నిందితుల అంత్యక్రియలు నిర్వహించారు.
See Also | కరోనా ఎఫెక్ట్ : బయో మెట్రిక్ విధానానికి స్వస్తి చెప్పిన కేంద్రం