విశాఖపట్నం : ఆంధ్ర,ఒరిసా, సరిహద్దు (ఏఓబీ) మల్కనగిరి జిల్లాలో మూసిపాడు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఒక పోలీసు, ఒక మావోయిస్టు మరణించాడు.
ఏఓబీలో మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేశారనే పక్కా సమాచారంతో మల్కనగిరి జిల్లా ఎస్పీ రిషికేశ్ దయానంద్ ప్రత్యేక పోలీసుదళాలతో కొత్తగూడ అటవీప్రాంతంలో గాలిస్తుండగా మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురుకాల్పులు జరపటంతో మావోయిస్టులు తప్పించుకుపోయారు.
ఎదురు కాల్పుల్లో ఒక పోలీసు ఘటనాస్ధలంలోనే మరణించాడు. మరొక పోలీసుకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన హెలికాప్టర్లో విశాఖ కేర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సంఘటన స్థలాన్ని పోలీసులు జల్లెడ పడుతుండగా పోలీసులకు ఒక మావోయిస్టు మృతదేహం లభ్యమైంది. ఘటనాస్ధలం నుంచి రెండు ఎస్.ఎల్. ఆర్ల తో పాటు ఒక ఏకే-47 విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.