తగిన శాస్తి : కుళ్లిన మాంసం అమ్మిన వ్యాపారిని ఇలా ఊరేగించారు

  • Publish Date - November 3, 2019 / 04:42 AM IST

తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి… నేడు ప్రతి చోట కల్తీమయం అయిపోయింది. అన్నింటా కల్తీ…కల్తీ…కల్తీ. దీనికి తోడు మోసాలు పెరిగిపోతున్నాయి. నగరాల్లోని హోటల్స్ రెస్టారెంట్లలో ఆహార పదార్ధాల్లో జరిగే కల్తీలపై ఫుడ్ ఇన్స్పెక్టర్లు అడపాదడపా దాడులు చేసి కేసులు బుక్ చేస్తుంటారు. 

ఇటీవలి కాలంలో హైదరాబాద్ లో ఇలాంటి వార్తలు ఎక్కువ వింటున్నాము. ఇదే గ్రామాల్లో జరిగితే ప్రజలు ఏం చేస్తారు. కుళ్లిన పదార్ధాలు, వస్తువులు అమ్మిన వ్యాపారిని ఏమీ చేయలేక మళ్లీ వాళ్ళ దగ్గరకు వెళ్లి వస్తువులు కొనకుండా ఉంటారు. కానీ కామారెడ్డి జిల్లా బిక్కనూరులో కుళ్లిన మాంసం అమ్మిన వ్యాపారికి వినూత్నంగా నిరసన తెలిపారు గ్రామస్తులు.

వివరాల్లోకి…. వెళితే బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో  కుళ్లిపోయిన మాంసం విక్రయించినందుకు ఓ వ్యాపారస్తుడి భుజాలపై చనిపోయిన మేకను ఎక్కించి డప్పువాయిద్యాలతో  ఊరంతా  ఊరేగించారు. మాంసం అమ్మేటప్పుడు వ్యాపరస్తులు, చనిపోయిన,వ్యాధులతో  ఉన్న గొర్రెలు, మేకల మాంసాన్ని విక్రయిస్తున్న విషయాన్ని గ్రామస్తులు గుర్తించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆవ్యాపారిని మాంసంతో ఊరేగించారు.