మద్యం మత్తులో సొంత అన్న కూతురిపై మృగంలా ప్రవర్తించాడు. రోజు చిన్నాన అంటూ.. ముద్దుగా వెనుక తిరిగే చిన్నారిని అన్నా వదినలపై కోపంతో మేడపై నుంచి కిందకి పడేశాడు. ఈ ఘటన విజయవాడలోని వాంబే కాలనీలో ఆదివారం (నవంబర్ 17, 2019)న చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
వాంబేకాలనీ సీ బ్లాకుకు చెందిన శ్రీదేవి, యేసురాజు దంపతులకు ముగ్గురు పిల్లలు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ప్రార్థన చేసుకునేందుకు శ్రీదేవి ఇల్లు శుభ్రం చేస్తుండగా.. ఇంతలో ఆమె మరిది కృష్ణ(28) బాగా తాగొచ్చాడు. మత్తులో అన్నాన్ని ఇంటి నిండా పడేశఆడు. దీంతో ఆమెకు కోపం వచ్చి.. ఎందుకు ఇలా చేస్తున్నవ్ అని గట్టిగా నిలదీసింది. నన్నే తిడతావా అంటూ బూతులు తిట్టడం మొదలు పెట్టాడు. ఇంతలో అన్నయ్య యేసురాజు వచ్చి కృష్ణపై చేయి చేసుకున్నాడు.
మరింత ఆగ్రహానికి గురయ్యాడు కృష్ణ. ఇంటి బయట ఉన్న అన్న పెద్ద కూతురు జానకి(6)ని రెండంతస్తుల భవనం నుంచి కిందకు పడేశాడు. దీంతో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. చెవుల నుంచి రక్తం రావడంతో వెంటనే 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.