family suicide attempt with childs, at AP secretariat, due to tahsildar cheating : తహసీల్దార్ మోసం చేశాడని ఏపీ సచివాలయం వద్ద దంపతులు ఆత్మహత్య-తహసీల్దార్ సస్పెండ్
ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి సచివాలయం వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన దంపతులు శనివారం ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కలకలం రేపింది. వారు తమ ఇద్దరు పిల్లలతో సహా పెట్రోల్ డబ్బాతో వచ్చి ఆత్మహత్యా యత్నం చేయబోయారు.
నెల్లూరు జిల్లా దుత్తలూరు ఎమ్మార్వో చంద్రశేఖర్ తమ దగ్గర ఒక కోటి రూపాయల పైన డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆరిగెల నాగార్జున దంపతులు ఆరోపిస్తున్నారు. పొలం ఆన్‌లైన్ చేస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన సమాచారం తెలుసుకుని సచివాలయానికి చేరుకున్న పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకున్నారు.
కాగా….. సైదాపురం ఎమ్మార్వో చంద్రశేఖర్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శేషగిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. మల్లాం వీఆర్వో ముంగర వెంకట రమణయ్య, చిట్టమూరు ఎమ్మార్వో కార్యాలయంలో పనిచేస్తున్న సబార్డినేట్ మారుబోయిన ప్రసాద్ లను కూడా సస్పెండ్ చేశారు.
చంద్రశేఖర్ గతంలో చిట్టమూరు, దుత్తలూరు ఎమ్మార్వో కార్యాలయాల్లో తహసీల్దారుగా పని చేశారు. ఆ సమయంలో ప్రభుత్వ భూములకు పట్టాలు ఇప్పిస్తానని ఆరిగెల నాగార్జున అనే వ్యక్తి నుంచి కోటిన్నర రూపాయలు లంచం తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి.
చిట్టమూరు నుంచి సైదాపురం మండలానికి బదిలీ కావడంతో భూ పట్టాల విషయం అటకెక్కింది. అయితే తీసుకున్న లంచం మొత్తాన్ని ఇవ్వకపోవడం, పట్టాలు ఇప్పించకపోవడంతో బాధితుడు నాగార్జున దాదాపు ఏడాది క్రితం నెల్లూరు కలెక్టరేట్ వద్ద భార్యాబిడ్డలతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.
ఆ సమయంలో అక్కడే వున్న కలెక్టరేట్ సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తమై బాధితుడిని కాపాడారు. డీఆర్వో మల్లికార్జున స్వయంగా వచ్చి బాధితుడిని పరామర్శించి, వివరాలు సేకరించారు. అనంతరం కలెక్టరుకు నివేదిక అందచేయడంతో ఎంక్వయిరీ వేశారు.
తాజాగా బాధితుడు ఈ రోజు ఏపీ సచివాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. తాజాగా చంద్రశేఖర్, వెంకట రమణయ్య, ప్రసాద్ లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.