Father Tortured Girl Child : వీడు తండ్రేనా..! కన్నకూతురిని దారుణంగా హింసించాడు

కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కర్కశంగా ప్రవర్తించాడు. తలకెక్కిన మద్యం మత్తుతో కన్నతండ్రే కర్కోటకుడిగా మారాడు.

Father Tourture Girl Child

Father Tortured Girl Child : కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కర్కశంగా ప్రవర్తించాడు. తలకెక్కిన మద్యం మత్తుతో కన్నతండ్రే కర్కోటకుడిగా మారాడు. నాలుగేళ్ల చిన్నారిని చితకబాదాడు. మెదక్‌ జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటన చూస్తే అసలు మానవత్వం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మానవత్వాన్ని మరిచి చేస్తున్న పనులతొ అసలు వీరు మనుషులేనా అనే సందేహాన్ని కలిగిస్తున్నాయి. ముక్కు పచ్చలారని ఓ చిన్నారిని తండ్రి అత్యంత దారుణంగా హింసించిన వీడియో చూసినవారంతా వాడసలు మనిషేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మెదక్‌ మునిసిపాలిటీలో నాగరాజు అనే వ్యక్తి ట్రాక్టర్‌ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతనికి నాలుగేళ్ల చిన్నారి గగనశ్రీ ఉంది. నాగరాజు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తల్లి.. తన కుమార్తెకు అన్నం తినిపించేందుకు ప్రయత్నిస్తోంది. తినకుండా గగనశ్రీ.. మారాం చేస్తుండడంతో.. నాగరాజు కోపంతో ఊగిపోయాడు. అందుబాటులో ఉన్న ఓ పొడవాటి తాడు తీసుకుని పాపను చితకబాదాడు.

అంతటితో ఆగని నాగరాజు చిన్నారిని ఒక చేత్తో గాల్లోకి లేపుతూ నేలపై కొట్టాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న భార్య చిరు నవ్వులు చిందుస్తుండడం విస్మయానికి గురి చేసింది. దీనంతటిని అక్కడే ఉన్న కొందరు సీక్రెట్‌గా ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు నాగరాజుపై తిట్ల దండకం మొదలు పెట్టారు. కన్న కూతురుని పాశవికంగా కోడుతున్న రాజుపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఇక ఈ విషయం పోలీసులకు వరకు వెళ్లడంతో తల్లిదండ్రులకు పోలీసులు గట్టిగా కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఇలాంటి తప్పులు మరోసారి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.