Woman Gives Electric Shocks To Husband
Wife Gives Electric Shock : సాధారణంగా భర్తలు పెట్టే హింస మీద మహిళలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కటం చూస్తుంటాము. మరో వైపు భార్యా బాధిత సంఘం అని పేరు చూడగానే నవ్వుకుంటాం. కానీ భర్తలను హింసించే భార్యలు ఉంటారని బాధితులను అడిగితే చెపుతారు. జైపూర్ కు చెందిన ఒక ఇల్లాలు కరెంట్ షాకిచ్చి భర్తపై తనకున్న కోపాన్ని తీర్చుకుంది.
వివరాల్లోకి వెళితే రాజస్థాన్ లోని బికనీర్ కు చెందిన మహేంద్ర ధన్(32) తన భార్య సుమన్(25)తో కలిసి జీవిస్తున్నాడు. చాలా కాపురాల్లో ఉన్నట్లుగానే వీరి కాపురంలోనూ తరచూ గొడవలు జరుగుతున్నాయి. మహేంద్ర తాగోచ్చి భార్యను వేధించేవాడు. ఆకారణంతో ఈనెల 12న మహేంద్ర భార్య ఓ ప్లాన్ వేసింది. డ్యూటీ ముగించుకుని ఇంటికొచ్చిన భర్తకు భోజనం వడ్డించింది. తిన్న తర్వాత భర్త అపస్మారక స్ధితిలోకి వెళ్లాడు. ఆమె భర్తకు భోజనంలో మత్తు మందు కలిపి పెట్టింది.
అపస్మారక స్ధితిలోకి వెళ్లిన భర్తను ఒక గోడ పక్కకు లాగింది. దానికి దగ్గరలోనే కరెంట్ సప్లై బోర్డు ఉంది. కొంత సేపటికి భర్త స్పృహలోకి వచ్చి తేరుకున్నాడు. అక్కడి నుంచి లేచేందుకు ప్రయత్నించాడు. కానీ లేవ లేక పోయాడు. అతని కాళ్లు కరెంట్ తీగలతో కట్టివేయబడ్డాయి. చేతులకు గ్లౌజ్ లు ధరించిన భార్య భర్తకు కరెంట్ షాక్ ఇచ్చింది.
తనను వేధింపులకు గురిచేస్తున్నావని చెపుతూ ఆమె పలు మార్లు భర్తకు కరెంట్ షాక్ ఇచ్చింది. దీంతో భర్త మరోసారి అపస్మారక స్ధితిలోకి వెళ్ళిపోయాడు. మళ్లీ కళ్లు తెరిచి చూసేసరికి ఆస్పత్రిలో బెడ్ మీద ఉన్నాడు. అయితే భర్త కరెంట్ షాక్ తగిలి గాయాలపాలయ్యాడని చెప్పి భార్య ఆస్పత్రిలో చేర్పించింది. భర్త వైపు కుటుంబ సభ్యులకు కరెంట్ షాక్ తగిలితే ఆస్పత్రిలో చేర్పించానని చెప్పింది. దీంతో వారంతా ఆస్పత్రికి చేరుకున్నారు.
భార్య ఇచ్చిన కరెంట్ షాక్ తో భర్త కాళ్లు పోగొట్టుకున్నాడు. భార్య లేని సమయం చూసి, ఆమె పెట్టిన చిత్ర హింసలు తన కుటుంబ సభ్యులకు వివరించాడు. దీంతో భర్త కుటుంబ సభ్యులు సర్దార్ షహర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఆమెపై ఐపీసీ సెక్షన 307 కింద కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.