ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్ లోని తన హాస్టల్లో ఫ్యాన్ కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
గువహటి: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం సాయంత్రం క్యాంపస్ లోని తన హాస్టల్లో ఫ్యాన్ కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఐఐటీ-గువహటి యూనివర్శిటీలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పన్నీం పవన్ సిద్ధార్థ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పవన్ కు అతడి స్నేహితులు కాల్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.
అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు హాస్టల్ గది తెరిచిచూడగా అప్పటికే పవన్ ఫ్యాన్ కు ఉరేసుకొని ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అతన్ని క్యాంపస్ నుంచి ఆస్పత్రికి తరలించగా అప్పటికే పవన్ మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. పవన్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పవన్ తల్లిదండ్రులు వచ్చిన తరువాత మంగళవారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్టు పోలీసులు తెలిపారు. పవన్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.