హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని జీడిమెట్ల, పారిశ్రామికవాడలోని దూలపల్లిలో శుక్రవారం సాయంత్రం ఒక కెమికల్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈరోజు ఎండ వేడి బాగా ఉండటంతో గోడౌన్ లోని కెమికల్ డ్రమ్ములోంచి మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 6 పైరింజన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. మంటలను గమనించిన సంస్ధలోని సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీయటంతో ప్రాణ నష్టం సంభవించలేదు. మంటల్లో ఒక కారు కాలి బూడిదైంది. గోడౌన్ నిర్వాహకులు పరారీలో ఉన్నారు.
గతంలో ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా అనధికారికంగా కెమికల్ గొడౌన్ లు నిర్వహిస్తున్నారని స్ధానికులు ఆరోపించారు. మంటలకు గోడౌన్ లోని డ్రమ్ములు పేలుతుండటంతో స్దానికులు భయభ్రాంతులకు గురయ్యారు. నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.