2017లో ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలో బీజేపీ బహిషృత ఎమ్మెల్యే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడింది నిజమేనని ఢిల్లీ కోర్టు తేల్చింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ఇవాళ(డిసెంబర్-16,2019)ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఘటనలో ప్రధాన నిందితుడుగా ఉన్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్ సెంగార్‌ను దోషిగా తేల్చింది. కేసుపై సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం) కింద ఎమ్మెల్యే కుల్దీప్ ను దోషిగా తేల్చింది. ఈ నెల 19న కుల్దీప్ కు శిక్షను ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.
2017లో ఉన్నావో ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని ఓ మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే కంప్లెయిట్ చేసిన బాలిక తండ్రినే పోలీసులు అరెస్ట్ చేయడం, కస్టడీలోనే ఆయన అనుమానస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం నమోదైన ఈ కేసుకు సంబంధించి రహస్య విచారణ చేపట్టారు. సీబీఐ వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది.
అయితే ఈ ఏడాది ఆగస్టులో బీజేపీ కుల్దీప్ ను పార్టీ నుంచి బహష్కరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీ నుంచి న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ ఈ కేసుపై రోజువారీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు చొరవతో ఈ కేసు లక్నో నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ అయింది.