హాజీపూర్ అమ్మాయిల వరుస హత్య కేసుల నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఓ బైక్ పై వెళుతూ శ్రీనివాస్ రెడ్డి
హాజీపూర్ అమ్మాయిల వరుస హత్య కేసుల నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఓ బైక్ పై వెళుతూ శ్రీనివాస్ రెడ్డి కనిపిస్తాడు. చాలా సంతోషంగా, నవ్వుతూ కనిపించాడు. బైక్ ను మరో వ్యక్తి నడుపుతున్నాడు. వెనకాల కూర్చున్న శ్రీనివాస్ రెడ్డి హ్యాపీగా కనిపించాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. శ్రీనివాస్ రెడ్డి సాధారణంగా ఎవరితోనూ కలిసేవాడు కాదని హాజీపూర్ గ్రామస్తులు చెబుతున్నారు. ఏదైనా నేరానికి పాల్పడితే మాత్రం కొన్ని రోజులు స్థానికులతో కలివిడిగా ఉండేవాడని అంటున్నారు. శ్రావణిని హత్య చేసిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి బైక్ పై తిరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హాజీపూర్ హత్యల కేసులో శ్రీనివాస్ రెడ్డిని తమ కస్టడీకీ అప్పగించాలని కోరుతూ బొమ్మలరామారం పోలీసులు భువనగిరి కోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీనివాస్ రెడ్డిని విచారించి మరిన్ని ఆధారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో అమ్మాయిల వరుస హత్యలు సంచలనం రేపాయి. 6వ తరగతి విద్యార్థిని కల్పన, టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి, డిగ్రీ స్టూడెంట్ మనీషా.. దారుణ హత్యకు గురయ్యారు. ఆ ముగ్గురిని తానే హతమార్చినట్టు పోలీసుల విచారణలో శ్రీనివాస్ రెడ్డి అంగీకరించాడు. మృతదేహాలను తన పాడుబడిన వ్యవసాయ బావిలో పాతిపెట్టాడు. శ్రావణి మృతదేహం బయటపడటంతో శ్రీనివాస్ రెడ్డి అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. లిఫ్ట్ పేరుతో అమ్మాయిలను బైక్ పై ఎక్కించుకుని వారిపై అత్యాచారం చేసి శ్రీనివాస్ రెడ్డి చంపేశాడని పోలీసుల విచారణలో తేలింది.
భువనగిరి కోర్టు సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు అతడిని వరంగల్ సెంట్రల్ జైలుకి తరలించారు. శ్రీనివాస్ రెడ్డిని ఉరి తియ్యాలని కొందరు, నడిరోడ్డుపై ఎన్ కౌంటర్ చెయ్యాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.