యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల హాజీపూర్ గ్రామంలో ఉద్రిక్త నెలకొంది. శ్రావణి, మనీషాల హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డిపై గ్రామస్తులు దాడి చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల హాజీపూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శ్రావణి, మనీషాల హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై గ్రామస్తులు దాడి చేశారు. శ్రీనివాస్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. అతడి ఇంటి ముందున్న పాకకు నిప్పు పెట్టారు. శ్రావణి, మనీషాలను హత్య చేసినట్లు శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. శ్రీనివాస్ రెడ్డి కి చెందిన బావిలోనే టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి, డిగ్రీ విద్యార్థిని మనీషా ల మృతదేహాలు లభించాయి.
లిఫ్ట్ పేరుతో అమ్మాయిలను బైక్ పై ఎక్కించుకుని వారిపై దారుణాలకు పాల్పడినట్టు శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు అమ్మాయిల హత్యలు గ్రామస్తులను ఉలిక్కిపడేలా చేశాయి. ఈ ఘటనలను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీనివాస్ రెడ్డిపై గ్రామస్తులు కోపంగా ఉన్నారు. ఈ ఆవేశంలో అతడి ఇంటిపై దాడి చేశారు. ఇంటిపై దాడి దృశ్యాలను కవర్ చెయ్యకుండా మీడియా ప్రతినిధులను గ్రామస్తులు అడ్డుకున్నారు. మీడియా వారికి సంబంధించిన కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఆస్తులను ధ్వంసం చేసి తీరుతామన్నారు. శ్రీనివాస్ ని ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒక్కసారిగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు వారిని కంట్రోల్ చెయ్యలేకపోయారు. ఈ ఘటనతో అలర్ట్ అయిన పోలీసు ఉన్నతాధికారులు.. అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందకు ప్రయత్నిస్తున్నారు.