ఎయిర్ అంబులెన్స్ లో ఢిల్లీకి ఉన్నావ్ బాధితురాలు…13కి.మీ గ్రీన్ కారిడార్

ఉత్తరప్రదేశ్ లో ఇవాళ(డిసెంబర్-5,2019)ఐదుగురు వ్యక్తులు ఉన్నావో అత్యాచార బాధితురాలిని సింధుపూర్ అనే గ్రామంలో సజీవదహనం చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే బాధితురాలి పరిస్థితి విషమించడంతో లక్నో నుంచి మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఢిల్లీకి ఎయిర్ అంబులెన్స్ లో తరలించారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి సప్ధర్ గంజ్ హాస్పిటల్ కు 13కిలోమీటర్ల మేర బాధితురాలిని అంబులెన్స్ లో తరలించే క్రమంలో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు.

కొన్ని నెలల క్రితం..ఉన్నావ్‌లో నివాసం ఉండే యువతిపై అత్యాచారం జరిగింది. తర్వాత బాధితురాలు పోలీసులకు కంప్లయింట్ చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటీవలే నిందితుడు బెయిల్‌ పై విడుదలయ్యాడు. ఫిర్యాదు చేసిన యువతిపై కక్ష పెంచుకున్నాడు.ఈ సమయంలో ఇవాళ స్థానిక కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో బీహార్ పోలీస్ స్టేషన్ పరిధి కిందకు వచ్చే సింధుపూర్ అనే గ్రామంలో యువతిపై ఒక్కసారిగా నిందితుడు..అతని నలుగురు స్నేహితులు దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

అయితే కాలిన గాయాలతో సహాయం కోసం బాధితురాలు కిలోమీటరకు పైగా నడించినట్లు సింధుపూర్ గ్రామస్థులు తెలిపారు. కిలోమీటరు దూరం కాలిన గాయాలతో నడిచి వెళ్లిన బాధితురాలు ఓ ఇంటి బయట పనిచేస్తున్న ఓ వ్యక్తి సాయం తీసుకుందని గ్రామస్థులు తెలిపారు. బాధితురాలు స్వయంగా 112కి ఫోన్ చేసి పోలీసులకు ఘటన గురించి సమాచారమిచ్చిందని తెలిపారు. బాధితురాలు ఫోన్ చేసిన తర్వాతనే పీఆర్ వీ,అంబులెన్స్ వచ్చినట్లు తెలిపారు.

మరోవైపు ఉన్నావ్ ఘటనను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. బాధితురాలికి భద్రత కల్పించకపోవడాన్ని తప్పుబట్టింది. యూపీ డీజీపీకి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఘటనపై నివేదిక ఇవ్వాలని డీజీపీని కోరింది.