Hyderabad Hemanth Honour Killing : గచ్చిబౌలిలో కిడ్నాప్ అయి విగత జీవిగా మారిన హేమంత్ కుమార్ హత్య కేసు బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపుతోంది. పోలీసింగ్ విధానం మారాలనే విషయాన్ని గుర్తు చేస్తోంది. గోపన్‌పల్లి తండా చౌరస్తా సమీపంలో ఆగిన కార్లను చూసి అక్కడి జనాలు సెల్‌ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీయడంతోనే సరిపోయింది.
ఒంటరి వ్యక్తిపై దాడిచేసి హత్య చేస్తున్న ప్రేక్షకుల్లా చూశారే తప్ప పోలీసులకు సమాచారం ఇవ్వలేదు.. అదే ఇచ్చి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదనే మాట వినిపిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 3.42 గంటల ప్రాంతంలో మూడు కార్లు ఆగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. పరిశీలిస్తే అవంతి రెడ్డి కుటుంబ సభ్యుల దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు.
దాడి చేస్తున్న వారిని ఎవరూ ఆపేందుకు ముందుకు రాలేదు.. మరింత రెచ్చిపోయారు. దాదాపు 20 నిమిషాలకుపైనే హేమంత్ పై దాడి చేశారు. తప్పించుకొని పారిపోతున్న హేమంత్ కుమార్ కిరాయి హంతకులు బిచ్చు యాదవ్, ఎరుకల కృష్ణలు, అవంతి రెడ్డి మేనమామ యుగంధర్ రెడ్డి చేజ్ చేసి పట్టుకున్నారు.
కారులో ఎక్కించుకొని తెల్లాపూర్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి పటాన్‌చెరు నుంచి జహీరాబాద్ తీసుకెళ్లారు. హేమంత్‌ను కారులో బలవంతంగా తీసుకెళ్లారని తెలిసిన పోలీసులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
పట్టుకున్న 11 మందిని విచారించారే తప్ప కిడ్నాప్ గురైన హేమంత్‌పై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. బలవంతంగా లాక్కొని పారిపోయారని హేమంత్ భార్య అవంతిరెడ్డి చెప్పినా మరుక్షణమే పోలీసులు ఆ కారు నంబరుతో సమీప పోలీసులకు చేరవేసి ఉంటే దొరికి ఉండేది కావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సుమారు 4.15 గంటల ప్రాంతంలో కిడ్నాప్ అయిన హేమంత్‌కుమార్‌ను దాదాపు 3 గంటలకుపైగా కారులో తిప్పారు. ఈ సమయంలో ఏదో ఒక ప్రదేశంలో పోలీసులు తనిఖీలు చేస్తే హేమంత్ హత్యకు గురయ్యే వాడే కాదన్న వాదన వినిపిస్తోంది.
యుగంధర్‌రెడ్డి, హేమంత్‌కుమార్ సెల్‌ఫోన్ సిగ్నల్ ట్రేసింగ్‌పైనే ప్రధానంగా దృష్టి సారించారు పోలీసులు.. సీసీటీవీ కెమెరా ఫుటేజీలను సాధ్యమైనంత తొందరగా పరిశీలించకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
హేమంత్ తీసుకెళ్లిన కారు మార్గంలో గస్తీ వాహనాలు ఉండి కూడా పట్టుకోకపోవడం పోలీసుల సమన్వయ లోపాన్ని వేలెత్తి చూపుతోంది. హేమంత్ ను చంపేందుకు సుపారీ ఇచ్చిన విషయాన్ని అవంతి రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి పోలీసులకు చెప్పలేదు. అతన్ని 4.30 గంటలకు పట్టుకుని.. కొన్ని గంటలపాటు విచారించినా అసలు ఏ విషయం చెప్పలేదు.