టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. రాజశేఖర్ ప్రయాణిస్తున్న వాహనం మూడు పల్టీలు కొట్టింది. ఈ యాక్సిడెంట్ నుంచి
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. రాజశేఖర్ ప్రయాణిస్తున్న వాహనం మూడు పల్టీలు కొట్టింది. ఈ యాక్సిడెంట్ నుంచి ఆయన సేఫ్ గా బయటపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా మంగళవారం(నవంబర్ 12,2019) అర్థరాత్రి శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ లో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదం విషయం తెలుసుకున్న రాజశేఖర్ కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. రాజశేఖర్ కి ఏం జరిగిందోనని కంగారు పడ్డారు. ప్రమాదంలో రాజశేఖర్ కు గాయాలు అయ్యాయని వార్తలు వచ్చాయి.
ఈ యాక్సిడెంట్ పై రాజశేఖర్ స్పందించారు. మంగళవారం రాత్రి ఫిలింసిటీ నుంచి వస్తుండగా అప్పా జంక్షన్ దగ్గర తన కారు ప్రమాదానికి గురైందని చెప్పారు. ఎదురుగా కారులో వస్తున్న వారు తనను గుర్తించి బయటకు తీసుకొచ్చారని వివరించారు. వారి ఫోన్ నుంచి పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చానని తెలిపారు. అక్కడి నుంచి వారి కారులోనే ఇంటికి చేరుకున్నానని చెప్పారు. ప్రమాదంలో తనకు గాయాలైనట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తనకు ఎలాంటి గాయాలు కాలేదన్నారు. అంతేకాదు.. కారులో తనతో పాటు మరో వ్యక్తి ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. కారులో తాను ఒక్కడినే ఉన్నట్టు రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు.
కారు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. కారుని సీజ్ చేశారు. అందులో తనిఖీలు చేయగా మద్యం బాటిళ్లు కనిపించాయి. ఇక ప్రమాదం సమయంలో కారు వేగం 150 కిమీ ఉంది. మద్యం బాటిళ్లు లభించడం, ఓవర్ స్పీడ్ ఉండటం పలు అనుమానాలకు దారితీసింది. మద్యం మత్తులోనే కారు ప్రమాదం జరిగిందా లేక అతివేగం కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.