భగ్గుమన్న బెంగళూరు…చరిత్రకారుడిని మాట్లాడనివ్వకుండా అరెస్ట్

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొద్దిరోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు,నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే గురువారం(డిసెంబర్-19,2019)బెంగళూరులో ఆందోళనలు మరింత ఉగ్రరూపం దాల్చాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) సహా పలు యూనివర్శిటీల విద్యార్థులు భారీ ఆందోళనను నిర్వహించడానికి తలపెట్టారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ సహా పలువురు ప్రముఖులు ఈ ఆందోళనల్లో భాగం పంచుకోవడానికి బెంగళూరుకు చేరుకున్నారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో అప్రమత్తమైన పోలీసులు 144 సెక్షన్ విధించారు. 72 గంటల పాటు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని వెల్లడించారు.చిత్రదుర్గ, విజయపుర, కలబురగి, బీదర్ నగరాల్లోనూ 144 సెక్షన్ ను విధించారు

144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ.. విద్యార్థులు నిరసన ప్రదర్శనకు దిగారు. బెంగళూరు నడిబొడ్డున ఉండే సర్ పుట్టణ్ణ చెట్టి టౌన్ హాల్ దగ్గర పెద్ద సంఖ్యలో గుమికూడారు. చరిత్రకారుడు రామచంద్రగుహ విద్యార్థులతో కలిశారు. అనంతరం వారు ప్రదర్శనగా మెజస్టిక్ వైపు బయలుదేరి వెళ్లడానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. టౌన్ హాల్ దగ్గర నుంచి కదలడానికి నిరాకరించారు. పోలీసుల హెచ్చరికలను విద్యార్థులు పట్టించుకోలేదు. ఈ సందర్భంగా విద్యార్థులు. పోలీసుల మధ్య పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంది. నో సీఏఏ, నో ఎన్ఆర్సీ అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా రామచంద్రగుహ మీడియాతో మాట్లాడటానికి ప్రయత్నించారు. దేశం మొత్తం వ్యతిరేకిస్తున్నప్పటికీ.. బీజేపీ ప్రభుత్వం పట్టుదలకు పోతోందని విమర్శించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఏ ఉద్దేశంతో ప్రవేశ పెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందో.. ఆ ఉద్దేశం నెరవేరబోదని చెప్పారు. రామచంద్రగుహ విలేకరులతో మాట్లాతున్న సమయంలో పోలీసులు ఆయనను రెక్కలు పట్టుకుని పక్కకు లాక్కుని వెళ్లారు. సీఏఏ చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఇటీవల ప్రధానికి లేఖ రాసిన ప్రముఖుల్లో రామచంద్ర గుహ కూడా ఉన్న విషయం తెలిసిందే.