మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం, ఆరా తీసిన హోం మంత్రి. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశం
హైదరాబాద్ : పాతబస్తీలోని కామాటిపురా పోలీసు స్టేషన్ పరిధిలోని మురళీ నగర్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన కేసు పై హోం మంత్రి మహమ్ముద్ ఆలీ ఆరా తీశారు. ఆదివారం నాడు బాలిక బంధువులు, స్ధానికులు కలిసి… కేసులో ప్రధాన నిందితుడిని ప్రత్యక్షసాక్షిగా చూపుతున్నారని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేసిన సంగతి తెలిసిందే. విషయం తెలిసిన హోంమంత్రి పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసును వేగంగా దర్యాప్తు చేసి నిందితులకు చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
కామాటిపుర పోలీసు స్టేషన్ పరిధిలోని మురళీధర్ నగర్ లో నివసించే 16 ఏళ్ళ బాలికకు అదేకాలనీలో నివసించే సమీప బంధువు విజయ్ తో పరిచయం ఉంది. ఆమెను లోబరుచుకోవాలని భావించిన విజయ్ ఒకసారి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చితాగమన్నాడు. విజయ్ పై నమ్మకంతో కూల్ డ్రింక్ తాగిన బాలిక మైకం లోకివెళ్ళగానే విజయ్ ఆమెపై లైంగిక దాడి చేశాడు. లైంగిక దాడి దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించి వాటిని తన స్నేహితులకు పంపాడు. ఆవీడియోలు బాలికకు చూపించి, సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి అతని స్నేహితులు కూడా ఆమెపై లైంగిక దాడి జరిపారు. ఇలా గత నాలుగేళ్లుగా 11 మంది ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇది భరించలేని బాలిక 2018 డిసెంబర్లో తల్లి తండ్రులకు విషయం చెప్పింది. దాంతో డిసెంబర్ 24న ఆమె తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పటికే ఈ కేసులో శుభం, రాజేష్, అభిజిత్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.