తీవ్ర విషాదం.. నాటు సారా తాగి 18మంది మృతి

ఈ ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనను ఎంతగానో కలిచి వేసిందన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారి గురించి ప్రజలకు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

Tamil Nadu Tragedy : తమిళనాడు రాష్ట్రం కల్లకురిచ్చి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నాటు సారా తాగి 18 మంది మరణించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనపై సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు. అధికారులపై కొరడా ఝళిపించారు.

కల్లకురిచ్చి జిల్లా కలెక్టర్ శ్రవణ్ కుమార్ ను బదిలీ చేసి ఎస్పీని సస్పెండ్ చేశారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించింది స్టాలిన్ ప్రభుత్వం. కొత్తగా కలెక్టర్ గా ప్రశాంత్, ఎస్పీగా చతుర్వేది బాధ్యతలు తీసుకున్నారు. అలాగే ఈ విషాదంపై సీబీసీఐడీ దర్యాఫ్తునకు సీఎం స్టాలిన్ ఆదేశించారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. 200 లీటర్లకు పైగా అక్రమ సారాను సీజ్ చేశారు.

నాటుసారా తాగిన 18 మృతి చెందిన ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతగానో కలిచి వేసిందన్నారు. నేరాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలను నివారించడంలో విఫలమైన అధికారులపైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారి గురించి ప్రజలకు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి నేరాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

* ఇంకా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 60మందికి పైగా బాధితులు
* వారిలో 25 మంది పరిస్థితి విషమం
* చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశాలు
* కల్లకురిచ్చి ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత, కల్తీ సారాకు రాష్ట్రం అడ్డాగా మారిందన్న మాజీ సీఎం పళని స్వామి
* కల్లకురిచ్చి ఆసుపత్రికి చేరుకున్న వైద్యశాఖ మంత్రి సుబ్రమణ్యన్
* గోవిందరాజు అనే వ్యక్తి కల్తీసారాను తయారు చేసి విక్రయించినట్లు గుర్తింపు.
* సారా తయారీలో మోతాదుకు మించి మిథనాల్ రసాయనాన్ని వినియోగించడం వల్లే మరణాలు సంభవించినట్లు ప్రాథమిక అంచనా.

Also Read : క్రైమ్ థిల్లర్‌ను తలపించేలా.. కట్టుకున్న భర్తను చంపించిన భార్య.. ట్విస్టులు మామూలుగా లేవు!

ట్రెండింగ్ వార్తలు