Chicken Curry
Chicken Curry : రాన్రాను మనుషుల్లో సహనం నశిస్తోంది… ప్రతి చిన్నవిషయానికి తీవ్రంగా స్పదించటం అలవాటైపోయింది. అసహనంతో ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు. మొన్నీ మధ్యనే పెళ్లాం కోడి కూర వండలేదని కర్ణాటకలో ఒక భర్త, భార్యను కొట్టి చంపిన ఘటన మరువక ముందే మధ్యప్రదేశ్ లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ లోని షాదోల్ జిల్లాలోని సెరియాటోల గ్రామంలో కమ్లేష్ కోల్, రాంబాయ్ కోల్ దంపతులు నివశిస్తున్నారు. గత నెల 23న కమ్లేష్ చికెన్ తీసుకువచ్చి భార్యను కోడికూర వండమన్నాడు. అందుకు ఆమె నిరాకరించింది. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగింది. కోపం పట్టలేని కమ్లేష్ కోల్ ఓ కర్ర తీసుకుని భార్యను విచక్షణారహితంగా కొట్టాడు. దాంతో ఆమె తలకు తీవ్ర గాయమై ప్రాణాలు విడిచింది.
అయితే ప్రమాదవశాత్తు గాయాలు తగిలి మరణించిందని చెప్పి అంత్యక్రియలు పూర్తి చేశాడు. కాగా… పోస్టుమార్టం రిపోర్టులో తలకు బలమైన గాయం అవటంతో మరణించినట్లు తేలింది. పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారించే సరికి కమ్లేష్ నేరం ఒప్పుకున్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.