రెచ్చిపోయిన మందుభామలు : కారుతో బీభత్సం

  • Publish Date - April 13, 2019 / 04:22 AM IST

హైదరాబాద్‌లో మందుబాబులే కాదు మందు భామలూ రెచ్చిపోతున్నారు. ఫుల్లుగా తాగేసి రోడ్డెక్కుతున్నారు. మద్యం మత్తుల్లో ర్యాష్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్లు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ముగ్గురు యువతులు హల్ చల్ చేశారు. ఫుల్‌గా డ్రింక్ చేసి కారులో వేగంగా వెళ్తూ రోడ్డు డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఆ తర్వాత వారు కారుని అక్కడే వదిలేసి పారిపోయారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ TS09 EM 3811. ఈ కారుపై ఇప్పటికే వెయ్యి రూపాయల చలానా ఉంది. అతి వేగం, ప్రమాదకర ప్రయాణం కింద కేసు బుక్ చేసిన పోలీసులు 2018 అక్టోబర్‌లో సైబరాబాద్‌ పీఎస్‌లో ఈ చలానా నమోదై ఉంది.

ట్రాఫిక్‌ పోలీసులు ఎన్ని నిబంధనలు పెట్టినా, ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మందుబాబులు మారడం లేదు. కేసులు పెడుతున్నా, ఫైన్లు వేస్తున్నా, ఆఖరికి జైళ్లకు పంపిస్తున్నా కేర్ చెయ్యడం లేదు. ఫుల్లుగా తాగేసి డ్రైవింగ్ చేస్తున్నారు, అడ్డంగా దొరికిపోతున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లతో ఎక్కడికక్కడ జల్లెడ పట్టినా.. రోజురోజుకు వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కేసులు  పెట్టినా, జైలుకు పంపినా.. మందుకొట్టి బండి నడుపుతూ ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. బ్రీత్‌ అనలైజర్లకు సహకరించకుండా పోలీసుల పైనే దాడులు చేస్తున్నారు. పోలీసులు ఎంత అవగాహన కల్పించినా మందుబాబుల్లో మార్పు రావడం లేదు..

బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లలో రాత్రి డ్రంక్‌ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు పోలీసులు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 27 కేసులు నమోదు చేశారు. 12 కార్లు, 13 బైకులు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం సేవించి వాహనం నడపరాదని, డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లతో పాటు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.