అమెరికాలో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. నార్త్ కరోలినా క్యారిసిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గొంగళ్ల సాహిత్ రెడ్డి (25) చనిపోయాడు. మే 14వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 04.15 గంటలకు (భారత కాలమానం ప్రకారం) అతను ఉంటున్న ప్లాట్ నుంచి జిమ్‌కు నడుచుకుంటూ వెళుతున్నాడు. వెనుక నుండి వచ్చిన కారు వేగంగా ఢీకొంది. దీంతో సాహిత్ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న స్నేహితులు ప్రమాద విషయాన్ని సాహిత్ కుటుంబసభ్యులకు తెలియచేశారు. దీనితో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సాహిత్ రెడ్డి మృతి చెందాడని తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్..TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR దృష్టికి తీసుకెళ్లారు. అమెరికాలోని ఎన్నారై సెల్ ప్రతినిధులతో కేటీఆర్ మాట్లాడారు. మృతదేహాన్ని హైదరాబాద్ తరలించడానికి సహాయం చేయాలని కోరారు. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ యాదవ్ మే 14వ తేదీ రాత్రి మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా ఎంబీసీలతో మాట్లాడి తొందరగా డెడ్ బాడీని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అమెరికాలోని తానా తెలుగు అసోసియేషన్, అక్కడి బంధువులు మృతదేహాన్ని పంపించేందుకు కృషి చేస్తున్నారు.
నల్లకుంటలోని పద్మాకాలనీలో మధుసూధన్ రెడ్డి, లక్ష్మీరెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. సాహిత్ రెడ్డి పెద్ద కుమారుడు. హైదరాబాద్‌లోని బ్రిలియంట్‌లో హై స్కూల్ విద్య, ఫిట్జి కాలేజీలో ఇంటర్, సీబీఐటీలో బిటెక్ చదివాడు. ఇతను 2016 ఆగస్టు 15న ఎమ్మెస్ చేయడానికి అమెరికాలోని న్యూజెర్సీకి వెళ్లాడు. రెండు నెలల క్రితమే నార్త్ కరోలినా క్యారిసిటీకి మకాం మార్చాడు. సాహిత్ రెడ్డి ఇకలేడనే వార్త తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొద్ది రోజుల్లోనే ఎమ్మెస్ పూర్తయి ఉద్యోగంలో చేరేవాడని..అంతలోనే ఘోరం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.