Delhi Shocker: టపాసుల మోత భరించలేని ఓ వ్యక్తి.. సహనాన్ని కోల్పోయి చుట్టుపక్కల వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అయితే ఈ కల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, నలుగురు వ్యక్తులు మాత్రం గాయపడ్డట్లు స్థానిక పోలీసులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని త్రినగర్ కాలనీలో దీపావళి రోజు జరిగిన ఘటన ఇది. రాత్రి సమయంలో కొందరు క్రాకర్లు కాలుస్తుండగా.. చిర్రెత్తుకొచ్చి తుపాకీతో బయటికి వచ్చిన వ్యక్తి.. క్రాకర్లు కాలుస్తున్న వారితో పాటు చుట్టుపక్కల వారిపై కాల్పులు జరిపినట్లు స్థానికులు తెలిపారు.
గాయపడ్డ మంజు జైన్, దల్మీత్ సింగ్, శుభం జైన్, అంకుర్ జైన్ అనే నలుగురు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక, కాల్పులు జరిపిన నిందితుడి పేరు అరవింద్ కుమార్ (41). ఇతడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అతడిపై సెక్షన్ 323/307, 25/27 ల కింద కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఘటనా స్థలం నుంచి రెండు ఖాళీ కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి ఒక అక్రమ ఆటోమేటిక్ పిస్టల్‌తో పాటు లైవ్ కాట్రిడ్జ్‌ను స్వాధీనం చేసుకున్నారు.