కల్కి ఆశ్రమం నుంచి రూ.93 కోట్లు విలువ చేసే నగదు, బంగారం స్వాధీనం

  • Publish Date - October 18, 2019 / 02:29 PM IST

ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ ఆశ్రమంలో గత 3 రోజులుగా సోదాలు జరిపిన ఐటీ  అధికారులు కేజీల కొద్దీ బంగారం, కోట్లు విలువచేసే వజ్రాలు, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఐటీ సోదాల్లో వేల ఎకరాలకు సంబంధించిన దస్తావేజులు, వివిధ పేర్లతో  నిర్వహిస్తున్న పలు వ్యాపారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు అధికారులు గుర్తించారు. ఆదాయపన్ను శాఖ అధికారులు కల్కి ఆశ్రమం నుంచి 5 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు, 26 కోట్లు విలువ చేసే 88 కిలోల బంగారం, 40.39 కోట్ల రూపాయల నగదుతో పాటు 18 కోట్ల రూపాయల విదేశీ  కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం చెన్నైలో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

ఇవి కాకుండా 409 కోట్ల రూపాయలకు సంబంధించి రసీదులు, ఆధారాలు చూపాలని  నోటీసులు జారీ చేశారు. కల్కి ఆశ్రమంలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. బయటకు మాత్రం ఆధ్యాత్మిక శిక్షణాతరగతులు, గ్రామాల అభివృద్ధి అని ప్రచారం చేస్తారు.  ఐదెకరాల నుంచి ప్రారంభమైన కల్కి ఆశ్రమం వేలాది ఎకరాలకు విస్తరించింది. అయితే ఇటీవలే ఈ పేరును ‘ఏకం’ అని మార్చారు. రకరకాల కంపెనీలు, ట్రస్ట్‌ల పేర్లతో వివిధ కార్యక్రమాలు  కల్కి ఆశ్రమం నిర్వహిస్తోంది. తమిళనాడు, తెలంగాణలోని పలు ప్రాంతాలు సహా  ఏపీలోని చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని కల్కి ఆశ్రమంతో సహా 40 ప్రాంతాల్లో  ఐటీ అధికారులు 3 రోజులపాటు సోదాలు నిర్వహించారు.

చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని ఆశ్రమం చుట్టూ భారీగా ఆస్తులున్నట్లు తెలుస్తోంది. ఒక్క తమిళనాడులోనే వెయ్యి ఎకరాలకు పైగా భూములున్నట్లు గుర్తించారు. ఐటీ అధికారుల సోదాలతో  కల్కి దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. వరదయ్యపాళెంలోని కల్కి ఆశ్రమంలో ప్రధాన నిర్వాహకులైన లోకేష్ దాసాజీ,శ్రీనివాస్ దాసాజీలను అదుపులోకి తీసుకుని అధికారులు   విచారిస్తున్నారు. అక్రమ సొమ్ముతో కల్కి కుటుంబ సభ్యులు విదేశాల్లో పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మనీ లాండరింగ్, హవాలా , పన్ను ఎగవేత తదితర అక్రమ మార్గాల్లో కల్కి ఇన్ని వందల కోట్లు ఆస్తులు కూడ బెట్టినట్లు అధికారులు వివరించారు. కల్కి ఆశ్రమం వందల గదులతో ఫైవ్ స్టార్ హోటల్ ను తలపించేదిగా ఉంటుంది.  పెద్ద ఎత్తున విదేశీ భక్తులు కల్కి ఆశ్రమానికి వస్తూ ఉంటారు. వారు ఇచ్చే విదేశీ విరాళాలతో బినామీ ఆస్తులు కూడ బెట్టటం, విదేశీ భక్తుల సాయంతో  పెద్ద ఎత్తున నగదును విదేశాలకు తరలించటం వంటివి చేసినట్లు తెలుస్తోంది.