కాశ్మీర్‌లో ఐఎస్‌ఐ ఉగ్రవాదులకు సాయం చేశాడన్న అనుమానంతో అక్కడి పోలీసులు మంగళవారం మార్చి 3న జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్‌కు చెందిన సరికెల లింగన్న అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. జమ్ముకాశ్మీర్‌కు చెందిన రాకేశ్‌కుమార్ అక్కడి ఆర్నియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఆర్మీ క్యాంప్‌లో కూలీ. అతడికి ఫేస్‌బుక్‌లో అనిత అనే పేరుతో ఉన్నవారితో పరిచయమైంది. తాను జర్నలిస్టునని, భారత సైనిక శిబిరంలోని వస్తువులు, వాహనాలు, ఆ ప్రాంత ఫొటోలు పంపితే వార్తలుగా రాస్తానని అనిత చెప్పడం తో రాకేశ్ ఆ పనులు చేశాడు.
దీనికోసం అనిత నుంచి రూ.27 వేలు రాకేశ్ ఖాతా లో జమయ్యాయి. రాకేశ్ ఫొటోలను తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో స్థానిక పోలీసులు జనవరి 5న అతడ్ని అరెస్టు చేశారు. రాకేశ్ ఖాతాలు పరిశీలించగా జగిత్యాలకు చెందిన లింగన్న గూగుల్‌పే ద్వారా గతనెల 13న రూ.5 వేలు, 25న రూ.4 వేలు పంపినట్టు తేలింది. దీని ఆధారంగా ఆర్నియా పోలీసులు లింగన్న విచారించటానికి వచ్చారు. దుబాయ్‌లో ఉన్న లింగన్న బంధువైన శ్రీనివాస్ ఓ బ్యాంకు ఖాతాకు నగదు పంపాలని సూచించడంతో డబ్బు పంపానని తెలిపాడు. దీంతో లింగన్నను విచారణకు తీసుకెళ్లేందుకు ఆర్నియా పోలీసులు మెజిస్ట్రేట్‌ను సంప్రదించగా అనుమతిచ్చారు.
See Also | ఇందిరా గాంధీ హాస్పిటల్‌లో మరో కరోనా పేషెంట్
లింగన్నకు బంధువైన శ్రీనివాస్ కొన్నేళ్లుగా దుబాయ్‌లో ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే దుకాణంలో పాకిస్థాన్ వ్యక్తి కూడా పనిచేస్తుండటంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి భారత్‌లో తమ బంధువు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని, గూగుల్‌పే ద్వారా రూ.9 వేలు పంపే ఏర్పాటు చేయాలని శ్రీనివాస్‌ను కోరినట్టు తెలిసింది. దీంతో శ్రీనివాస్ ఫోన్‌లో బ్యాంకు ఖాతాను లింగన్నకు పంపగా, ఆ ఖాతాకు లింగన్న రూ.9 వేలు పంపినట్టు తెలుస్తోంది.