మంగుళూరు ఎయిర్ పోర్టులో బాంబు కలకలం

  • Publish Date - January 21, 2020 / 02:14 AM IST

దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే  వేడుకలకు సిధ్దమవుతున్నవేళ అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భధ్రత కట్టుదిట్టం చేస్తున్నారు. అయినా కొన్ని చోట్ల  సంఘ వ్యతిరేక శక్తులు అలజడి సృష్టించటానికి సిధ్దమవుతూనే ఉన్నాయి. మంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బాంబు కలకలం రేపింది. టికెట్ కౌంటర్ వద్ద  అనుమానాస్పద స్ధితిలో ఉన్న బ్యాగును  పోలుసులు గుర్తించారు. దాన్ని తనిఖీ చేయగా అందులో పేలుడు పదార్ధాలు ఉన్నట్లు  గుర్తించారు. వెంటనే బాంబు నిర్వీర్యం చేసే సిబ్బందికి సమాచారాన్ని అందించారు.

బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ వారు వచ్చి బ్యాగును తనిఖీ చేయగా ఆ బ్యాగులో ఐఈడీ పేలుడు పదార్థం ఉన్నట్టుగా అనుమానించారు.  వెంటనే బ్యాగ్‌ను అక్కడినుంచి థ్రెట్ కంటైన్మెంట్ వెహికల్‌లో ఉంచి, 2కిలోమీటర్ల దూరంలో కెంజార్‌లోని బహిరంగ స్థలానికి తీసుకెళ్లి పరిశీలించారు.

ఆ బ్యాగ్‌లో మెటల్ బాక్స్ ఉందని, అందులో పేలుడు పదార్థం, లోహపు ముక్కలు ఉంచారని పోలీసులు తెలిపారు.   వెంటనే దాన్ని ఇసుక మూటల మధ్య ఉంచి పేల్చి వేశారు. దీంతో  పెను ప్రమాదం తప్పింది.

ఈ సంఘటనతో  పోలీసులు హై అలర్ట్ ప్రకటించి..ఎయిర్‌పోర్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌ ద్వారా అనుమానితుడ్ని గుర్తించారు. నీలం రంగు పుస్తకాన్ని పట్టుకున్న ఒక వ్యక్తి  తలకు టోపీ పెట్టుకుని ముఖాన్ని దాచుకుంటూ ఆటోలో వెళ్లినట్టు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. నిందితుడు ప్రయాణించిన  ఆటోను కూడా పోలీసులువిడుదల చేశారు. 
”ప్రాధమిక సమాచారం ప్రకారం, మంగుళూరు విమానాశ్రయంలో బాంబును కనుగొన్నాం. దీనిని నిర్వీర్యం చేసి, దీని వెనుకున్న వారిని గుర్తించ డానికి విచారణ జరుగుతోంది” అని కర్నాటక హోం మంత్రి బసవరాజ్‌ బొమ్మై  తెలిపారు. 

తొలుత, విమానాశ్రయంలో భద్రత నిర్వహిస్తున్న సెంట్రల్‌ ఇండిస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సిఐఎస్‌ఎఫ్‌) అనుమానాస్పద బ్యాగ్‌ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో మంగుళూరు పోలీస్‌ కమిషనర్‌ పి ఎస్‌ హర్ష పోలీస్‌, బాంబ్‌ నిర్వీర్యం చేసే బృందాలతో విమానాశ్రయానికి చేరుకుని బాంబును  పేల్చి వేశామని చెప్పారు.