కేరళలో విషాదం : చిన్నారి దేవానంద లేదు

  • Publish Date - February 28, 2020 / 03:32 PM IST

కేరళ రాష్ట్రం ఆ చిన్నారి క్షేమంగా ఉండాలని వేడుకుంది. వందలాది మంది చిన్నారి కోసం గాలించారు. ఈ చిన్నారి ఎక్కడైనా ఉంటే..ఆచూకీ చెప్పాలంటూ..సోషల్ మీడియాలో చిన్నారి ఫొటోను తెగ షేర్ చేశారు. తల్లిదండ్రులతో పాటు వేలాది మంది చేసిన ప్రార్థనలు ఫలించలేదు. ఆ చిన్నారి విగతజీవిగా తేలింది. దీంతో కేరళలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ చిన్నారి..ఇక లేదని తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనానీతతంగా ఉంది. ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. ఈ విషాద ఘటన కొల్లాం జిల్లాలో చోటు చేసుకుంది. 

ఎలవూరకు చెందిన ప్రదీప్ కుమార్ – ధన్య దంపతులకు దేవానంద (6) కూతురు ఉంది. ప్రదీప్ విదేశాల్లో ఉంటాడు. దేవానందను ముద్దుగా పొన్ను అని పిలుచుకుంటారు. వక్కనుడులో ఉన్న సరస్వతి విద్యానికేతన్ స్కూల్‌లో ఫస్ట్ క్లాస్ చదువుతోంది. 
 

తల్లి ధన్య..ఇంటికి సమీపంలోనే బట్టలు ఉతికేందుకు వెళ్లింది. దేవానందను ఇంటి దగ్గరే ఉండాలని చెప్పింది. ఇంటికి వచ్చి చూడగా..కూతురు కనిపించలేదు. ఈ ఘటన 2020, ఫిబ్రవరి 27వ తేదీ గురువారం చోటు చేసుకుంది. దీంతో తల్లి చుట్టుపక్కల వెతికింది. ఎక్కడా కనిపించలేదు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎంతో ముద్దుగా ఉన్న చిన్నారి ఫొటో సామాజిక మాధ్యమాలో తెగ వైరల్ అయ్యింది. సినీ రంగానికి చెందిన ప్రముఖులు సైతం దీనిపై స్పందించారు. చిన్నారి క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. ఆచూకీ తెలిస్తే చెప్పాలని చాలా మంది షేర్ చేశారు. సమాచారం తెలుసుకున్న ప్రదీప్ సొంత గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో 2020, ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం ఇథిక్కల్ సరస్సులో చిన్నారి మృతదేహం లభ్యమైంది.

విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని పోలీసులు బయటకు తీశారు. సమాచారాన్ని ప్రదీప్ దంపతులకు తెలియచేశారు. తమ కూతురు కాదని అక్కడకు వెళ్లారు. అంతే షాక్ గురయ్యారు. ఆ డెడ్ బాడీ..గారాలముద్దు బిడ్డ దేవానందని గుర్తు పట్టి కుప్పకూలిపోయారు తల్లిదండ్రులు. 

సరస్సు చిన్నారి ఇంటికి సమీపంలోనే ఉంది. ప్రమాదవశాత్తు అందులో పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం చిన్నారి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. దేవానంద మృతదేహం పడి ఉన్న సరస్సు వద్దకు భారీగా ప్రజలు తరలివచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. 
Read More : ముందే జాగ్రత్త పడండి : 13 రోజులు బ్యాంకులు బంద్!