దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో మరో కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. అదే నిందితులు దిశను లారీలో ఎక్కించుకుని వెళ్తున్న
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో మరో కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. అదే నిందితులు దిశను లారీలో ఎక్కించుకుని వెళ్తున్న వీడియో. నవంబర్ 27న రాత్రి నలుగురు నిందితలు దిశపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత దిశను లారీలో ఎక్కించి చటాన్ పల్లికి తీసుకెళ్లారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. దానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దిశ కేసులో ఈ వీడియో ఇప్పుడు కీలకంగా మారింది. నిందితులను గుర్తించడంలో ఈ వీడియో కీలకం కానుందని పోలీసులు భావిస్తున్నారు. నవంబర్ 27న రాత్రి 10.28గంటల సమయంలో దిశను తొండుపల్లి టోల్‌గేట్ నుంచి లారీలో తరలించినట్టు పోలీసులు గుర్తించారు. టోల్ గేట్ దగ్గరున్న సీసీటీవీ కెమెరాల్లో 2 లారీలు వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి.
తొండుపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో నిందితులు దిశపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత దారుణంగా హత్య చేశారు. అదే రోజు రాత్రి 10గంటల సమయంలో దిశ మృతదేహాన్ని దుప్పట్లలో చుట్టి లారీలో చటాన్‌పల్లి వరకు తీసుకెళ్లారు. అక్కడ పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టారు. ఈ ఘటనలో దిశ మృతదేహం 70శాతం వరకు కాలినట్లు పోలీసులు తెలిపారు. దిశ కేసులో దర్యాప్తు జరిపిన పోలీసులు.. నిందితులను 24గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. లారీ నెంబర్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. ఆరిఫ్, నవీన్, శివ, చెన్నకేశవలును అరెస్ట్ చేశారు.
శుక్రవారం(డిసెంబర్ 6,2019) తెల్లవారుజామున దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం పోలీసులు నలుగురు నిందితులను సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ పోలీసులపై దాడి చేసి తుపాకులు లాక్కుని పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నలుగురూ మృతి చెందారు. నిందితుల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.
దిశ హత్యాచారం నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ పోలీసులపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే పలు మహిళా సంఘాలు నిందితులను ఎన్‌కౌంటర్ ను వ్యతిరేకించాయి. చట్ట ప్రకారం వెళ్లి వారిని శిక్షించి ఉండాలని అభిప్రాయపడ్డారు. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగింది. ఎన్ కౌంటర్ పై దర్యాఫ్తు చేపట్టింది. నిజాలు తెలుసుకునే పనిలో ఉంది. ఎన్ కౌంటర్ చేసిన పోలీసులను ఎన్ హెచ్ ఆర్ సీ విచారిస్తోంది. వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇద్దరే ఆయుధాలు లాక్కుంటే.. నలుగురినీ ఎందుకు చంపారు? పారిపోతుంటే పట్టుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇలా ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై కేసులు కూడా నమోదయ్యాయి. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణ కూడా జరుగుతోంది.