శభాష్ లేక్ పోలీస్ : నలుగురి ప్రాణాలు కాపాడారు

  • Publish Date - February 10, 2019 / 01:45 PM IST

హైదరాబాద్ : ట్యాంక్‌బండ్‌లో దూకి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న తల్లి..బిడ్డలను లేక్ పోలీసులు కాపాడి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్న పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటన ఫిబ్రవరి 10వ తేదీ ఆదివారం చోటు చేసుకుంది. వారాసీగూడకు చెందిన ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ట్యాంక్‌బండ్‌ వద్దకు చేరుకుంది. వెంటనే ట్యాంక్ బండ్‌లోకి దూకేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో అక్కడనే భద్రతలో ఉన్న లేక్ పోలీసులు వారిని కాపాడారు. అనంతరం వీరిని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. తల్లికి కౌన్సెలింగ్ ఇచ్చారు. 

ఘటనకు సంబంధించని దానిపై సీఐ ధనలక్ష్మితో 10tv మాట్లాడింది. వారాసీగూడకు చెందిన మహిళ…తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోందని తెలిపారు. ఈమె భర్త జీహెచ్ఎంసీ కాంట్రాక్టు లేబర్‌గా పనిచేస్తున్నాడని..వీరికి ఇద్దరు అమ్మాయిలు..ఒక అబ్బాయి ఉన్నారని పేర్కొన్నారు. మద్యానికి బానిసైన అతను ఇంటిని పట్టించుకోవడం మానేశాడని…దీనితో ఆ మహిళ ఇళ్లల్లో పాచిపని చేసుకుంటూ జీవనం సాగిస్తోందన్నారు. ఆమెను శారీరకంగా..మానసికంగా వేధించేవాడని..దీనితో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందన్నారు. ఈమెకు కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగిందని సీఐ పేర్కొన్నారు.