ఉత్తర్ ప్రదేశ్ : ఖైదీ పోలీసుల చెర నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. పోలీసులకు లిక్కర్ పార్టీ ఇచ్చి పరార్ అయ్యాడు. లాయర్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ, దోపిడీ కేసుతో పాటూ దాదాపు పది కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ బద్దాన్ సింగ్ పోలీసుల చెర నుంచి తప్పించుకున్నాడు.
1996లో ఓ లాయర్‌ను హత్య చేసిన ఘటనలో బద్దాన్ సింగ్ జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. ఫతేగర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న బద్దాన్‌ను ఓ కేసు విచారణ విషయంలో గజియా బాద్ తరలించడానికి ఏర్పాట్లు చేశారు. మంచి లిక్కర్ పార్టీ అరేంజ్ చేశానని, బద్దాన్ తనకు ఎస్కార్టుగా వచ్చిన పోలీసులను నమ్మించి మీరట్‌లోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ తన అనుచరులతో పోలీసులకు మందు పార్టీ ఏర్పాటు చేశాడు. మద్యం మత్తులో పోలీసులు ఉన్న సమయంలో అక్కడి నుంచి బద్దాన్ పరారు అయ్యారు.
ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మొత్తం ఏడుగురు పోలీసులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో ఓ ఇన్‌స్పెక్టర్ కూడా ఉండటం గమనార్హం. బద్దాన్‌ను త్వరలోనే పట్టుకుంటామని మీరట్ ఎస్‌పీ నితిన్ తివారీ పేర్కొన్నారు.