Love Failure Suicide : ప్రేమ ఒకరితో….పెళ్లి మరోకరితో…… కలిసుండలేక…..!
వాళ్లిద్దరిదీ ఒకే ఊరు...యుక్త వయస్సులో ఉండంగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. తల్లి తండ్రులు వీరి ప్రేమను అంగీకరించలేదు.
- chvmurthy
- Published On : September 24, 2021 / 08:20 AM IST
Love Failure Suicide
Love Failure Suicide : వాళ్లిద్దరిదీ ఒకే ఊరు…యుక్త వయస్సులో ఉండగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. తల్లి తండ్రులు వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకుని జీవించసాగారు. గతం గుర్తుకు వచ్చి పెళ్లైన 15 ఏళ్ల తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లాలోని నరసరావు పేట మండలం ఇసప్పాలెంకు కు చెందిన బత్తుల వెంకట కాళేశ్వరరావు(45) బత్తుల నాగలక్ష్మి(40) లు 15 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని పెద్దలకు చెప్పారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో కాళేశ్వరరావు గుంటూరుకు చెందిన లక్ష్మీ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. నాగలక్ష్మి నరసరావు పేటకు చెందిన వ్యక్తితో పెళ్లి చేశారు పెద్దలు.
కాళేశ్వరరావు గ్రామంలోనే ఉంటూ తాపీ మేస్త్రీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి ఇద్దరు ఆడపిల్లలు, ఒకమగ పిల్లాడు పుట్టారు. బత్తుల నాగలక్ష్మి నరసరావు పేట పట్టణంలోని పెద్ద చెరువులో నివాసం ఉంటోంది. భర్త టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.
Also Read : Wife Killed By Husband : భర్తను కొట్టి చంపిన భార్య
కరోనా నాగలక్ష్మి కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టింది. కుటుంబం గడవటం కష్టంగామారింది. ఏడాది క్రితం భర్తను తీసుకుని స్వగ్రామం ఇసప్పాలెంకు వచ్చింది. అక్కడే ఉంటూ గ్రామంలో వారికి టైలరింగ్ లో శిక్షణ ఇస్తూ జీవనం సాగిస్తోంది. స్వగ్రామం వచ్చే సరికి ప్రేమికులిద్దరూ మళ్లీ ఎదురుపడ్డారు. గత స్మృతులు గుర్తుకు వచ్చాయి. ఏమనుకున్నారో ఏమో తెలియదు. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎన్నాళ్లనుంచి కలుసుకుంటున్నారో…. పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకున్నారో తెలియదు.
ఇద్దరూ కలిసి బుధవారం శ్రీశైలం పుణ్య క్షేత్రానికి వెళ్లారు. రాత్రి 9 గంటల సమయంలో సత్రంలో గదిని అద్దెకు తీసుకున్నారు. గురువారం ఉదయం కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కొద్ది సేపటి తర్వాత కాళేశ్వరారావు బయటకు వచ్చి కడుపులో తిప్పుతోందని అరుస్తూ కేకలు వేస్తూ కింద పడిపోయాడు.
సత్రం సిబ్బంది గమనించి వెంటనే సున్నిపెంట ఆస్పత్రికి తరలించారు. గదిలో అపస్మారక స్ధితిలో ఉన్న నాగలక్ష్మిని సున్నిపెంట ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
