love couple suicide in ranga reddy: రంగారెడ్డి జిల్లాలో గండిపేట్‌లో విషాదకర ఘటన జరిగింది. ప్రేమ వ్యవహారం ఓ యువతి, యువకుడి ప్రాణాలు తీసింది. కలిసి జీవించడం ఇక కుదరదు అనుకున్నారో.. ఏమో కానీ.. కలిసి చనిపోదామని నిర్ణయించుకున్న ఆ ప్రేమికులు రెండు రోజుల ముందు పురుగుల మందు తాగారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ ప్రాంతానికి చెందిన సంపత్, పార్వతి నార్సింగ్ మంచిరేవుల ప్రాంతంలో కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగారు. అయితే ఈ విషయాన్ని సంపత్ తన స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అతడి స్నేహితుడు వాళ్లను ఆస్పత్రికి తరలించాడు. అయితే సంపత్, పార్వతి పరిస్థితి అప్పటికే విషమంగా మారడంతో హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అటు.. జగిత్యాల జిల్లా హైదర్ పల్లిలోనూ ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పాడుబడిన ఇంట్లో పురుగుల మందు తాగిన ప్రేమజంట ఆ తర్వాత ఉరేసుకుంది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు లోనికి వెళ్లి చూశారు. దీంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. 10 రోజుల క్రితమే ఆ ఇద్దరు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలు కుళ్లిపోయి ఉన్నాయి. బాగా దుర్వాసన వస్తున్నాయి.
కలకలం రేపిన ఘటన:
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని, మరింత స్పష్టత వచ్చే చాన్స్ ఉందని పోలీసులు తెలిపారు.
ప్రేమిస్తే చావేనా?
ఈ మధ్య కాలంలో ప్రేమజంట ఆత్మహత్యల ఘటనలు ఎక్కువయ్యాయి. పెద్దలు ఒప్పుకోలేదని కొందరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంట్లో వాళ్లు తిరస్కరిస్తారనో, విడదీస్తారనో అనే భయాలు, అనుమానాలతో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. కాగా, మరికొందరు ధైర్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. అలా పెళ్లి చేసుకున్న జంటలు కొన్ని హ్యాపీగా ఉంటే, మరికొందరు మాత్రం పరువు హత్యలకు బలై పోతున్నారు.
ఉరితాడు నుంచి తల, మొండెం వేరు:
ప్రేమజంట ఆత్మహత్య ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుడి పేరు మధు. హైదర్ పల్లికి చెందిన మధు జగిత్యాలకు చెందిన ఓ యువతితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగడంతో పాటు.. దూలానికి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓ పాడుబడిన ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో…అక్కడకు వెళ్లి చూసిన గ్రామస్థులకు మృతదేహాలు కనిపించాయి. పదిరోజుల క్రితం వారిద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితికి చేరాయి. ఉరితాడు నుంచి తల, మొండెం వేరయ్యాయి. ఘటనా స్థలం చూసి స్థానికులు భయాందోళన చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.