లోపలేశారు : పాకిస్తాన్ జిందాబాద్ అని పోస్ట్ పెట్టిన వ్యక్తి అరెస్ట్

  • Publish Date - February 28, 2019 / 04:22 PM IST

అనంతపురం: పాకిస్తాన్‌ జిందాబాద్‌ అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతపురం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు పెనుకొండకు చెందిన నౌషద్ వలీని స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. నౌషద్ పెనుకొండలో ఫుట్ పాత్ మీద గడియారాలు రిపేర్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వలీపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. భారత్ లో ఉంటూ పాకిస్తాన్ కు అనుకూలంగా పోస్టు పెట్టిన వలీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉగ్రదాడిలో 40మంది జవాన్లు అమరులైన ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేసింది. ఈ దాడిలో 300మంది టెర్రరిస్టులు హతమయ్యారని సమాచారం. దీన్ని తట్టుకోలేకపోయిన పాకిస్తాన్ భారత్ పై వైమానిక దాడులకు తెగబడింది. బోర్డర్ లో కాల్పులకు దిగింది. భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

ఈ పరిస్థితుల్లో యావత్ భారతీయులు ఆర్మీకి అండగా నిలిచారు. అయితే కొందరు వ్యక్తులు.. మనోభావాలను గాయపరిచేలా సోషల్ మీడియాలో పాకిస్తాన్‌కు అనుకూలంగా పోస్టులు పెట్టి వివాదానికి కారణం అవుతున్నారు.