అనుకోకుండా వచ్చే ఆర్థిక అవసరాలకు ఎవరైన సొంత స్థలమో, తమకు సంబంధించిన వస్తువులో బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకుంటారు, అవసరాలు తీర్చుకుంటారు. ఓ వ్యక్తి మాత్రం తన అవసరాలకు ఏకంగా ఊరిలోని ఓ కాలనీనే బ్యాంకులో తాకట్టుపెట్టాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో, బాధితులు లబోదిబోమంటున్నారు. ఘరానా మోసాలకు అంతులేకుండా పోతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలోని రెవిన్యూ అధికారుల చేతివాటంతో .. గ్రామంలోని ఓ కాలనీ మొత్తాన్ని తాకట్టు పెట్టి బ్యాంక్ రుణాలు పొందాడో ప్రబుద్దుడు. గ్రామంలోని 1231, 1232 సర్వే నెంబర్లలో.. 80 ఏళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకుని తమ కుటుంబాలతో కలిసి నివసిస్తున్నారు. ఈ ఇళ్లు తమ తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వీరికి లభించినవే.
1232 సర్వే నంబర్‌లోని 24 గుంటల స్థలం.. 1998-1999లో పట్టాదారుగా సిరిసిల్ల మల్లవ్వ, కబ్జాదారుగా సద్ది పోశవ్వ పేర్లు ఉన్నాయి. 2000-2001 వచ్చేటప్పటికి పట్టాదారు పేరు రికార్డుల్లో మారిపోయింది. అసలు పట్టాదారు ఆ స్ధలం అమ్మకుండానే.. దుర్గం పెద్ద నర్సయ్య పట్టాదారుగా పేరు ప్రత్యక్షమైంది. 1231 సర్వే నంబర్‌లోని 18 గుంటల స్థలం తనదేనంటూ .. దీనిపై 2012లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఎల్లారెడ్డిపేట శాఖలో తనఖా పెట్టి, నర్సయ్య అనే వ్యక్తి లోన్ పొందాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఈ విషయాన్ని ఆధారాలతో సహా సేకరించి బయటపెట్టాడు. తూనికలు, కొలతల శాఖలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన నర్సయ్య మోసం తెలుసుకుని.. బాధితులు లబోదిబోమంటున్నారు. తమ పూర్వీకుల నుంచి ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్న భూమిలో.. కబ్జాదారులుగా, పట్టాదారులుగా ఇతరుల పేర్లు చేరడమేంటంటూ విస్తుపోతున్నారు. నర్సయ్య పట్టా చేయించుకోవడంతో ఆగకుండా .. ఆ స్థలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి మరీ లోన్ కూడా పొందాడు. ఇల్లు ఉన్న స్థలాన్ని ఖాళీ స్థలం కింద బ్యాంకు వారు ఎలా తనఖా పెట్టుకున్నారనేది .. అంతు చిక్కడం లేదంటూ బాధితులు మండిపడుతున్నారు.
మోసాన్ని నిలదీసిన బాధితులతో ఇల్లు మీవి.. స్థలం నాదంటూ నర్సయ్య వింత సమాధానం ఇవ్వడమే కాదు, విషయం బయటకు చెబితే మీ ఇళ్లను కూలదోస్తానంటూ బెదిరిస్తున్నాడని.. బాధితులు వాపోతున్నారు. మోసాన్ని వెలికితీసిన యువకుడిని చంపేస్తానని బెదిరించాడని ఆరోపిస్తున్నారు. కబ్జా విషయంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తమకు ప్రాణభయం ఉందని అంటున్నారు. దీనిపై పోలీస్ స్టేషన్‌కు వెళితే సివిల్ మ్యాటర్ అంటూ దరఖాస్తు తీసుకోవడానికి కూడా తిరస్కరించారని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని, మోసానికి పాల్పడిన వ్యక్తిని, అతనికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు.