ఉద్యోగాల పేరుతో యువతులకు వల….కోట్లు కొల్లగొట్టాడు

  • Publish Date - March 21, 2020 / 11:29 AM IST

టెక్నాలజీ పెరిగిపోయి సోషల్ మీడియాలో ఎక్కడెక్కడివారో పరిచయం చేసుకుని ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిందని సంతోషించాలో…సోషల్ మీడియా ద్వారా  పెరుగుతున్న నేరాలు చూసి భాదపడాలో తెలియటంలేదు. సోషల్‌ మీడియాలో యువతులను పరిచయం చేసుకొని.. వారికి మాయమాటలు చెబుతూ.. లక్షల్లో దోచేసిన ఘరానా సైబర్‌ నేరగాడు హర్ష కేసులో సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

రూ.20 కోట్ల ప్రాజెక్టు వచ్చిందని.. తన బంధువుల వద్ద నుంచి హర్ష అనే పేరుతో  ఒక వ్యక్తి రూ. 58 లక్షలు మోసం చేశాడంటూ ట్యాంక్‌బండ్‌ ప్రాంతంలో నివాసముండే వైద్య విద్యార్థిని రెండు రోజుల క్రితం సైబర్‌క్రైమ్‌ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. దర్యాప్తులో నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, రామచంద్రారావు పేటకు చెందిన జోగడ వంశీకృష్ణ అలియాస్‌ హర్షవర్థన్‌రెడ్డి అని తేలింది. ఇతడు బీటెక్‌ మధ్యలోనే ఆపేసి 2014 లో హైదరాబాద్‌కు జీవనోపాధి కోసం వచ్చాడు. 
 

హైదరాబాద్ వచ్చాక బతుకు తెరువు కోసం కొన్నాళ్లు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ సోషల్‌ మీడియాలో జిమ్మిక్కులు చేయడంలో పట్టుసాధించాడు. ఆ  క్రమంలో తియ్యని మాటలతో పలువురు యువతులకు వల వేశాడు. వారికి మాయమాటలు చెబుతూ  వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తూ నగరాల్లో తిరుగుతూ గుర్రపు పందాలు ఆడాడు.

2017లో సుస్మిత అనే పేరుతో  ప్రొఫైల్‌ తయారు చేసి,  ఆమె స్నేహతురాళ్లకు మెసేజ్‌లు పెట్టి, ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసాలకు పాల్పడ్డాడు. ఆమె స్నేహితులను ఫేస్‌బుక్‌లో పలుకరిస్తూ మంచి చెడ్డల గురించి ఆరా తీయడం, ఉద్యోగం కావాలంటే తన స్నేహితుడు వంశీకృష్ణ ఉన్నాడంటూ డబ్బులు లాగేవాడు. అలాగే స్నేహరెడ్డి పేరుతో ఫేస్‌బుక్‌ ఐడీ తయారు చేసి, దాని ద్వారా మల్టీనేషనల్‌ కంపెనీలో ఉద్యోగాలంటూ నమ్మిస్తూ రూ. 1.37 కోట్లు కొట్టేశాడు. 
 

ఇతడి మోసాలపై సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో 2017, జూన్‌ 15న సైబరాబాద్‌ పోలీసులు ఈ సైబర్‌ నేరగాడిని అరెస్ట్‌ చేశారు. ఇలా మోసపూరితంగా సంపాదించిన డబ్బును నీళ్లలా వంశీకృష్ణ ఖర్చుపెట్టాడని పోలీసుల విచారణలో తెలుస్తున్నది. గుర్రపు పందాల ఆటల్లో కొన్ని సందర్భాల్లో గంటకు రూ. 7 లక్షలు కూడా పందాలు కాశాడని తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. వంశీకృష్ణను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందం గాలింపు చేపట్టింది.  ఇతడి మోసాలు మరిన్ని బయటపడే అవకాశాలున్నాయని పోలీసులు తెలిపారు.