ఒడిశా రాష్ట్రం మల్కన్ గిరి జిల్లాలో మావోయిస్టును హత్య చేశారు. జంతురాయి గ్రామస్తులు రాళ్లతో కొట్టి మావోయిస్టును చంపేశారు. మృతుడిని గుమ్మ ఏరియా కమిటీ సభ్యుడు
ఒడిశా రాష్ట్రం మల్కన్ గిరి జిల్లాలో మావోయిస్టును హత్య చేశారు. జంతురాయి గ్రామస్తులు రాళ్లతో కొట్టి మావోయిస్టును చంపేశారు. మృతుడిని గుమ్మ ఏరియా కమిటీ సభ్యుడు హడ్మాగా పోలీసులు గుర్తించారు. గ్రామస్తుల రాళ్ల దాడిలో నందపూర్ ఏరియా కమిటీ సభ్యుడు జిప్రోకు తీవ్ర గాయాలు అయ్యాయి. బీఎస్ఎఫ్ బలగాలు జిప్రోను అదుపులోకి తీసుకున్నాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
శనివారం(జనవరి 25,2020) అర్థరాత్రి తర్వాత మావోయిస్టులపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. మావోయిస్టు హత్యతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు.
మావోయిస్టుల చర్యలు, హింసలతో గ్రామస్తులు విసిగిపోయారు. స్థానికంగా రోడ్ల నిర్మాణాలకు మావోయిస్టులు అడ్డు పడుతున్నారు. రహదారుల నిర్మాణ పనులకు ఆటంకం కలిగిస్తున్నారు. రోడ్లు సరిగా లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు వేసేందుకు సహకరించాలని మావోయిసులకు కోరారు. అయినా లాభం లేకపోయింది. దీంతో మావోయిస్టులపై కోపం పెంచుకున్న గ్రామస్తులు రాళ్లతో దాడి చేసి చంపేశారు. గ్రామస్తుల చర్యతో షాక్ తిన్న మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు.
దళానికి చెందిన ఒక మావోని పట్టుకున్న గ్రామస్తులు కొట్టి చంపారు. మరో మావోయిస్టుని తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. స్థానికంగా భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. మావోయిలు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశముందన్న పోలీసులు గట్టి నిఘా పెట్టారు.