Madhya Pradesh Ration scam
Madhya Pradesh Ration scam : మన దేశంలో కుంభకోణాలు కొత్తేమీ కాదు. గడ్డి మొదలుకొని 2జీ వరకు ఏ ప్రభుత్వ చరిత్ర తిరగేసినా స్కామ్‌ల లిస్టు చాంతాడంత బయటకొస్తుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో రేషన్ కుంభకోణం పెద్ద ప్రకంపనలే సృష్టిస్తోంది. వందకోట్లకు పైగా పాఠశాల చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహార పథకంలో భారీగా అవినీతి జరిగినట్లు తేలింది. అది కూడా సీఎం నిర్వహిస్తున్న శాఖలో కుంభకోణం వెలుగు చూడడంతో మరింత కలకలం రేగుతోంది.
బీజేపీ పాలిత రాష్ట్రంలో భారీ కుంభకోణం వెలుగు చూడడం కలకలం రేపుతోంది. బాలికలు, మహిళలకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన స్కీంలో భారీగా అవినీతి జరిగినట్లు బయటపడింది. మధ్యప్రదేశ్‌లోని పేద బడుగు వర్గాల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు 2018లో కేంద్రం పోషక విలువలు కలిగిన రేషన్‌ను ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. దీని కోసమే మధ్యప్రదేశ్ ప్రభుత్వం టీహెచ్‌ఆర్ పేరుతో ఉచిత రేషన్ పథకాన్ని మొదలుపెట్టింది. నిజానికి ఈ స్కీమ్ 2018లో ప్రారంభమైనా.. డబ్ల్యూసీడీ అధికారులు 2021 ఫిబ్రవరి వరకు కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారు. కానీ అవినీతి మాత్రం 2018 నుంచే మొదలుపెట్టారు. చాలా జిల్లాల్లో ఈ పథకాన్ని 2018 నుంచే అమలు చేస్తున్నట్లు చూపించి ఆ నిధులను తమ జేబుల్లో వేసుకున్నారు. ఇదంతా సాక్షాత్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చేతిలో ఉన్న మహిళా శిశు సంక్షేమశాఖలోనే జరగడం మరింతగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ కుంభకోణాన్ని బయటపెట్టింది మరెవరో కాదు.. మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆడిటరే..! కుంభకోణంపై ప్రభుత్వ ఆడిటర్ రూపొందించిన 36 పేజీల నివేదికను ఓ జాతీయ మీడియా సంస్థ బయటపెట్టడంతో అవినీతి పరుల బాగోతం బట్ట బయలు అయింది. ఆ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని 53 జిల్లాలకు గాను.. 8 జిల్లాల్లోని 49 అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించిన ఆడిట్‌లో రూ. కోట్ల మేర అవినీతి జరిగినట్లు తేలింది. మిగతా జిల్లాల్లోనూ అక్రమాలు జరిగి ఉంటాయని, వాటిల్లోనూ ఆడిట్ నిర్వహిస్తే.. ఈ కుంభకోణం విలువ రూ. వందల కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. టీహెచ్‌ఆర్ పథకంలో మిల్లర్ల స్థాయిలోనే భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆడిటర్ జనరల్ తనిఖీలు నిర్ధారించాయి. రాష్ట్రంలోని పలు మిల్లర్ల నుంచి రేషన్‌ను సేకరించినట్లు డబ్ల్యూసీడీ లెక్కలు చెబుతున్నాయి. ఒక ఆరు మిల్లుల నుంచి 821 మెట్రిక్ టన్నుల రేషన్‌ను సరఫరా అయినట్లు రికార్డుల్లో చూపారు. అదే నిజమైతే ఆ మిల్లుల కరెంట్ బిల్లు కూడా భారీగా ఉండాలి. కానీ అలాంటిదేమీ లేదు. ఈ విషయాన్ని ఆడిటర్ జనరల్ గుర్తించారు. అంటే మిల్లర్లతో కుమ్మక్కై తప్పుడు లెక్కలు వేయించినట్లు తేలిపోయింది. ఇలా ఏకంగా 58 కోట్లు దోచేశారని నివేదికలో స్పష్టం చేశారు. ఈ రేషన్ కుంభకోణం మధ్యప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ కుంభకోణంతో చిన్నారులు, మహిళలు పోషకాహారలోపానికి గురికావటంతో పాటు పన్ను చెల్లింపుదారుల కోట్లాది రూపాయలు అవినీతిపరుల చేతిలోకి వెళ్లినట్లు రాష్ట్ర ఆడిటర్ గుర్తించారు. ఈ పోషకాహార పథకం సీఎం చేతిలో ఉన్న మహిళా శిశు సంక్షేమ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణలో ఉంది. అంటే ఆయను డైరెక్షన్‌లోనే మొత్తం అవినీతి జరిగిందా ? లేదంటే అసలు సూత్ర ధారులు వేరే ఉన్నారా ? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అతనితో పాటు ఇందులో రాష్ట్ర స్థాయిలో ఒక డైరెక్టర్ పది మంది జాయింట్ డైరెక్టర్లు, 52 మంది జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు, ఏకంగా 453 మంది సీడీపీవోలు పని చేస్తున్నారు. ఇంతమందిని దాటుకుని వందకోట్లకు పైగా అవినీతి చేయడమంటే మాటలు కాదు. లేదంటే ఇందులో చాలా మందికి తెలిసే ఈ అవినీతి జరిగి ఉండాలి. ఇదంతా ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లోనే జరిగిందని ఇప్పటికే ప్రతిపక్షాలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మరి దారుణంగా పసిపిల్లల నోటి దగ్గర ముద్దను లాక్కుని మరీ జోబులు నింపుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది అక్కడి బీజేపీ ప్రభుత్వానికి మాయని మచ్చలా మారింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అందులోనూ సీఎం స్వయంగా నిర్వహిస్తున్న శాఖలో భారీ కుంభకోణం వెలుగు చూడడంతో ప్రతిపక్షాలో ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తున్నాయి.
సీఎం శివరాజ్ సింగ్ హయాంలో ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. గతంలో వ్యాపం కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ స్కామ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో పాటు ఆయన భార్య, అప్పటి ఎంపీ గవర్నర్‌పైనా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇది కూడా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.