మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఓ వైపు హైదరాబాద్,ఉన్నావ్ ఘటనలను దేశవ్యాప్తంగా ముక్తకంఠంతో ఖండిస్తున్న వేళ త్రిపురలో మరో దారుణం వెలుగుచూసింది. 17ఏళ్ల బాలికను దాదాపు రెండు నెలలుగా పలుసార్లు రేప్ చేసి పెట్రల్ పోసి తగులబెట్టిన ఘటన శనివారం జరిగింది. ఈ కేసులో అజోయ్ రుద్ర పాల్(25)అనే యువకుడు,అతని తల్లి అనిమా రుద్ర పాల్(59)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అక్టోబర్ 28,2019న కోవాయ్ జిల్లాలోని కళ్యాణ్ పూర్ లోని తమ ఇంటి దగ్గరికొచ్చి తమ కూతుర్ని అజోయ్ కిడ్నాప్ చేసి అతని ఇంటికి తీసుకెళ్లాడని,పలుసార్లు తన కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలి తండ్రి పోలీసులకు తెలిపాడు. బాధిత బాలికను పెళ్లి చేసుకునేందుకు 5లక్షల రూపాయలు కట్నం అజోయ్ డిమాండ్ చేశాడని,బాధితురాలి తల్లిదండ్రుల ఒత్తిడితో కట్నం మొదటి ఇన్ స్టాల్ మెంట్ అందిన తర్వాత డిసెంబర్-11,2019న బాలికను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
అయితే కట్నం విషయంలో అజోయ్,అతడి తల్లికి మధ్య గొడవ జరిగిందని,ఈ సమయంలో బాలికపై అజోయ్ కిరోసిన్ పోసి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. కాలిన గాయాలతో శనివారం గోవింద్ బల్లభ్ పంత్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ బాలిక చనిపోయిందని తెలిపారు. తమ కూతురు మరణంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు,స్థానికులు అజోయ్,అతని తల్లి అనిమాపై దాడి చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నామని,చనిపోయే ముందు బాలిక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబడిందని పోలీసులు తెలిపారు.
బాధిత బాలిక పొరుగింటివాళ్లు తెలిపిన ప్రకారం… అజోయ్ వాళ్ల కుటుంబసభ్యుడొకరు బాధిత బాలిక కుటుంబానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడని,ఆ విధంగా వాళ్లు ఒకరొకరు మొట తెలుసునని,ఆ తర్వాత సోషల్ మీడియా,ఫోన్ ద్వారా దగ్గరయ్యారని తెలిపారు.