దిశ ఘటన మర్చిపోక ముందే తెలుగు రాష్ట్రాల్లో వరుసగా దారుణాలు జరుగుతున్నాయి. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తర్వాత కూడా ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కొందరు మృగాళ్లలో మార్పు రాలేదు. తాజాగా ఏపీలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. బర్త్ డే పార్టీ పేరుతో బాలికను ఇంటికి పిలిచిన ఓ యువకుడు లైంగిక దాడి చేశాడు. అడ్డుకోవాల్సిన తల్లే దారుణంగా ప్రవర్తించింది. తన కొడుక్కి ఆ తల్లి సహకరించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడితో పాటు.. అతని తల్లిని కూడా అరెస్ట్ చేశారు.
హెచ్‌బీ కాలనీకి చెందిన 15 ఏళ్ల బాలికకు విద్యాధరపురం ప్రాంతానికి చెందిన సాయి అనే యువకుడు మాయమాటలు చెప్పి విద్యాధరపురంలోని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దుశ్చర్యకు అతడి తల్లి కూడా సహకరించింది. డిసెంబర్ 2న ఈ ఘోరం జరిగింది. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. డిసెంబర్ 6న రాత్రి విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నా.. మార్పు కనిపించడం లేదు. కొందరు కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. దీంతో ఆడపిల్లల భద్రతపై ఆందోళన నెలకొంది. బయటికి వెళ్లిన అమ్మాయి తిరిగి ఇంటికి క్షేమంగా వస్తుందో రాదో అని కంగారు పడుతున్నారు.