ఏడేళ్ల బాలుడి కిడ్నాప్ : నిందితుడు ఎవరో తెలిసి పోలీసులు షాక్

హైదరాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ కిడ్నాప్ కేసు పోలీసులకు దిమ్మతిరిగేలా చేసింది. ఏడేళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుడు ఎవరో తెలిసి పోలీసులు విస్తుపోయారు.

  • Publish Date - November 18, 2019 / 09:18 AM IST

హైదరాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ కిడ్నాప్ కేసు పోలీసులకు దిమ్మతిరిగేలా చేసింది. ఏడేళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుడు ఎవరో తెలిసి పోలీసులు విస్తుపోయారు.

హైదరాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ కిడ్నాప్ కేసు పోలీసులకు దిమ్మతిరిగేలా చేసింది. ఏడేళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుడు ఎవరో తెలిసి పోలీసులు విస్తుపోయారు. ఇది నిజమేనా అనే అనుమానం కలిగింది. ఏడేళ్ల బాలుడిని 10 తరగతి విద్యార్థి కిడ్నాప్ చేయడం సంచలనం రేపింది. కిడ్నాప్ చేసి రూ.3లక్షలు ఇవ్వాలని బాబు తండ్రికి ఫోన్ చేశాడు.

మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. రాజ్ కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భార్య, కొడుకు అర్జున్(7)తో కలిసి మీర్‌పేటలోని టీఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం(నవంబర్ 17,2019) మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న అర్జున్ సడెన్ గా కనిపించకుండా పోయాడు. పిల్లాడు ఏమైపోయాడోనని తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించడం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత రాజ్‌కుమార్ కు ఓ నెంబర్ నుంచి వచ్చింది. ‘మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం. రూ.3లక్షలిస్తేనే వదిలిపెడతాం’ అంటూ అవతలి వ్యక్తి చెప్పి కాల్ కట్ చేశాడు.

దీంతో ఆందోళన చెందిన రాజ్‌కుమార్ వెంటనే మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ కోసం గాలింపు చేపట్టారు. ఈలోగా కిడ్నాపర్ పదేపదే రాజ్‌కుమార్‌కు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయసాగాడు. దీంతో పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా కిడ్నాపర్ ఉన్న లొకేషన్ గుర్తుపట్టి అక్కడికి చేరుకున్నారు. ఆ కిడ్నాపర్‌ని చూశాక అంతా ఒక్కసారిగా షాకయ్యారు. నిందితుడు ఏ కరడుగట్టిన నేరస్తుడో అనుకున్నారు. కానీ 10వ తరగతి చదువుతున్న 14ఏళ్ల బాలుడు నిందితుడు అని తెలిసి విస్తుపోయారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన అతడిని పట్టుకున్నారు. అర్జున్‌ని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. ఇదంతా కేవలం 3 గంటల్లోనే పూర్తయ్యింది.

ఈ కిడ్నాప్ వెనుక ఇంకెవరి హస్తమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏడేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసింది మైనర్ బాలుడు అని తెలిసి పోలీసులే కాదు అర్జున్ తల్లిదండ్రులు, స్థానికులు కూడా షాక్ అయ్యారు. చక్కగా స్కూల్ కి వెళ్లి చదువుకుని ఆడుకోవాల్సిన వయసులో కిడ్నాప్ చేయడం, డబ్బు డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. అర్జున్ తండ్రితో కిడ్నాపర్ ఫోన్ లో మాట్లాడిన తీరు హైలైట్ గా మారింది. కిడ్నాపర్‌లా ఫోజ్ ఇస్తూ మైనర్ మాట్లాడిన తీరు.. సినిమాలకు బాగానే ప్రభావితం అయినట్లు అనిపిస్తోందని పోలీసులు అంటున్నారు. కాగా.. సీరియళ్లు, సినిమాల ప్రభావంతోనే చిన్న పిల్లల్లో నేరస్వభావం పెరిగిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టకపోతే ఇలాగే చెడు మార్గంలో వెళ్లే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. 

ఈ కిడ్నాప్ కేసు వివరాలు సీపీ మహేష్ భగవత్ మీడియాకు తెలిపారు. ఏడేళ్ల అర్జున్ ను కిడ్నాప్ చేసిన నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. మీర్ పేట్ టీఎస్ఆర్ కాలనీలో అర్జున్ కిడ్నాప్ అయ్యాడని చెప్పారు. రూ.3లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్ అర్జున్ తండ్రికి ఫోన్ చేశాడని వివరించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అల్మాస్ గూడలో నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు మైనర్ కావడంతో జువెనైల్ హోమ్ కి తరలించామని సీపీ చెప్పారు.