స్వలింగ సంపర్కమే ఇస్రో సైంటిస్ట్ హత్యకు కారణం

హైదరాబాద్ లోని తన నివాసంలో ఇస్రో శాస్ర్తవేత్త హత్య కేసులో డయాగ్నస్టిక్ సెంటర్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తే హంతకుడని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు స్వలింగ సంపర్కానికి సహకరిస్తున్నా.. తాను ఆశించినట్లు సైంటిస్ట్ డబ్బులు ఇవ్వడంలేదనిసైంటిస్ట్‌ను అతడు హత్య చేశాడని తెలిపారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్, వెస్ట్‌జోన్ డీసీపీ సుమతి ఘటనకు సంబంధించినవివరాలను వెల్లడించారు.

 
ఎస్‌ఆర్‌నగర్‌లోని ధరమ్ కరమ్ రోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌లో నివాసముండే ఎస్.సురేశ్‌కుమార్(56) బాలానగర్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌సీ(నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్)లో సైంటిస్ట్‌గా పనిచేసేవాడు. ఆయన భార్య ఇందిరా చెన్నైలో బ్యాంకు ఉద్యోగం చేస్తుంది. కొడుకు యూఎస్ లో సెటిల్ అవడం,కూతురు ఢిల్లీలో ఉండటంతో సురేశ్‌కుమార్ ఒంటరిగా ఉండేవాడు. ఆరోగ్యానికి సంబంధించి రక్త పరీక్షలు చేయించుకునే సమయంలో సురేష్ కుమార్ కు  విజయ డయాగ్నస్టిక్ సెంటర్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసే జంగమ శ్రీనివాస్‌తో రెండు నెలల కిందట పరిచయం ఏర్పడింది. కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందిన శ్రీనివాస్ అమీర్‌పేట్‌లోని సాయి బాలాజీ హాస్టల్స్‌లో నివాసముంటున్నాడు.  

సురేశ్‌కుమార్ అప్పుడప్పుడు రక్త పరీక్షలు చేయించుకుంటుండడంతో రక్త నమూనాలను తీసుకోవడం కోసం శ్రీనివాస్ అతని ఇంటికి వెళ్లేవాడు. సురేశ్‌కుమార్ ఒంటరిగా ఉండడం, సైంటిస్ట్‌గా పనిచేస్తుండడంతో ఆర్థికంగా బలంగానే ఉంటాడని, భవిష్యత్‌లో ఆర్థికపరమైన అవసరాలు తీర్చుకోవచ్చని భావించిన శ్రీనివాస్ సురేశ్‌కుమార్‌కు స్వలింగ సంపర్కానికి సహకరించాడు. ఒకటి రెండుసార్లకు డబ్బు ఇస్తాడని ఆశపడ్డాడు శ్రీనివాస్. సురేశ్‌కుమార్ డబ్బు ప్రస్తావన తేవడం లేదు. డబ్బు వస్తుందని భావించినా డబ్బు రాకపోవడంతో శ్రీనివాస్‌లో కోపం పెరిగింది. ఇక తాడోపేడో తేల్చుకోవాలని శ్రీనివాస్ భావించి అవసరమైతే సురేశ్‌కుమార్‌ను హత్య చేయాలని ప్లాన్ వేసుకొని ఒక కత్తిని కొనుగోలు చేసి, హత్య చేసేందుకు గూగుల్, యూట్యూబ్‌లలో శోధించాడు.

గత నెల 30వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో సురేశ్‌కుమార్ ఫ్లాట్‌కు వెళ్లిన శ్రీనివాస్ స్వలింగ సంపర్కంలో పాల్గొన్నాడు. అయినా సురేశ్‌కుమార్ డబ్బులు ఇవ్వకపోవడంతో శ్రీనివాస్ కోపంతో కత్తితో అతన్ని హత్య చేసి తలుపులు వేసి పరారయ్యాడు. ఈనెల 1న సురేశ్‌కుమార్ భార్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు ఆధారాలను సేకరించారు. ఘటనా స్థలంలో లభ్యమైన రక్తపు నమూనాలు, వెంట్రుకలను పరిశీలించారు. సెల్‌ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుడు శ్రీనివాస్‌గా గుర్తించారు. దీంతో శుక్రవారం అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా, చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి ఘటనా స్థలంలో లభించిన శాస్ర్తీయమైన ఆధారాలతోపాటు హత్యకు ఉపయోగించిన కత్తి, మృతుడు సురేశ్‌కుమార్‌కు చెందిన రెండు బంగారు రింగులను స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు.