Mp Raghu Rama Krishna Raju
MP Raghu Rama Krishna Raju : రాజద్రోహం కేసు కింద అరెస్టయిన నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ విడుదల కానున్నారు. సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. ఈమేరకు ఆయన వ్యక్తిగత లాయర్.. గుంటూరు సీఐడీ కోర్టులో రిలీజ్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
ఇప్పటికే ఆయనకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆయన సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. గుంటూరు సీఐడీ కోర్టులో ఇవాళ రిలీజ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. దీంతో సోమవారం సాయంత్రం లోగా ఆయన ఆర్మీ ఆస్పత్రి నుంచి విడుదలయ్యే అవకాశముంది. రిలీజ్ ఆర్డర్స్ వచ్చే వరకు ఆయన మిలటరీ ఆస్పత్రిలోనే ఉంటారు.
సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రఘురామకృష్ణంరాజును ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. రఘురామ కుమారుడు భరత్‌తోపాటు.. వ్యక్తిగత లాయర్ కలిశారు. చికిత్సకు సంబంధించిన వివరాలను భరత్, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే రఘురామ ఆరోగ్యం మెరుగైనట్లు వైద్యులు వివరించారు. ఇక విడుదలకు సంబంధించిన అంశాలపై రఘురామ వ్యక్తిగత లాయర్ చర్చించారు.
రఘురామకు ఈనెల 21న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారులతో, లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్ తీసుకోవచ్చని తెలిపింది. శుక్రవారం బెయిల్ వచ్చినా ఆయన మాత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు. మిలటరీ ఆస్పత్రిలోనే వైద్యం తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కూడా మెరుగైంది. దీంతో న్యాయవాది ఇవాళ గుంటూరు సీఐడీ కోర్టులో రిలీజ్‌కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియ మధ్యాహ్నానికి పూర్తి చేస్తే.. సాయంత్రంలోగా రఘురామ విడుదలయ్యే అవకాశముంది.
ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం, ఇతరులతో కలిసి కుట్రలు చేయడం అనే సెక్షన్ల కింద రఘురామను అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాలో గుంటూరు జైలుకు తరలించారు. ఆయన అనారోగ్యానికి కావడంతో సుప్రీం ఆదేశాలతో సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయన అక్కడే వైద్యం తీసుకుంటున్నారు. బెయిల్ కూడా మంజూరు కావడంతో ఆయన ఇవాళ విడుదలకానున్నారు.