ఎలా మోసం పోయాడో.. అలాగే ఛీటింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు

ఎలా మోసం పోయాడో.. అలాగే మోసం చేయాలనుకున్నాడు. అపరితవ్యక్తుల ద్వారా డబ్బులు పోగోట్టుకున్న అతడు.. అపరిచిత వ్యక్తిగా మారాడు.

Cyber Crime Gang Arrested: నర్సింగ్ నాయక్.. ఇతని దారి మోసపుదారు. ఎలా మోసం పోయాడో.. అలాగే మోసం చేయాలనుకున్నాడు. అపరితవ్యక్తుల ద్వారా డబ్బులు పోగోట్టుకున్న అతడు.. అపరిచిత వ్యక్తిగా మారాడు. ఆఫీసు తెరిచాడు.. ఉద్యోగులను నియమించుకున్నాడు. ఇక మొదలెట్టాడు. అమాయకులను ఎంచుకుంటూ.. లక్షలు కాజేశాడు. కానీ పాపం పండింది.. చివరకు ఇతని చీటింగ్ పోలీసులకు తెలిసింది.

ముద్ర, ధని లోన్, పీఎం విశ్వకర్మ లోన్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది సైబర్ నేరగాళ్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 26 ఫోన్లు, నాలుగు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోట టౌన్కు చెందిన కుమ్మరి రాజుకు లక్ష కోసం పీఎం విశ్వకర్మ కమ్యూనిటీ వర్క్ లోన్ అప్లై చేసుకున్నాడు. అదేరోజు అతని వాట్సాప్‌కు గుర్తుతెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా లోన్ సాంక్షన్ చేసేందుకు ఫీజ్ చెల్లించాలని అపరిచిత వ్యక్తి సూచించారు. దీంతో గూగుల్ పే, ఫోన్ పే ద్వారా బాధితుడు 12,250 రూపాయలు ట్రాన్స్‌ఫ‌ర్‌ చేశాడు. ఆ తర్వాత మళ్లీ 9 వేలు చెల్లించాలని సైబర్ నేరగాడి నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో బాధితుడు డబ్బులు చెల్లించేందుకు నిరాకరించాడు. అనుమానం వచ్చి కాల్ చేశాడు. ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గుర్తించాడు. పోలీస్స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

విచారణ చేపట్టిన పోలీసులు.. పెద్దమందడి మండలం జంగమాయపల్లికి చెందిన కురుమూర్తిని కొత్తకోటలో అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఈ అక్రమాలకు వర్తియావత్ నర్సింగ్ నాయక్ సూత్రధారి అని తేల్చారు. పోలీసులు నర్సింగ్ నాయక్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ముద్ర, ధని లోన్స్ దరఖాస్తుదారులే టార్గెట్
నర్సింగ్ నాయక్ బిహార్‌కు చెందిన రోహిత్‌తో పరిచయం ఏర్పరచుకుని ఈ దందా సాగిస్తున్నట్లు స్పష్టమైంది. రోహిత్ నుంచి ముద్ర, ధని రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లబ్ధిదారుల పేర్లు, ఫోన్ నెంబర్లు, చిరునామా, ఈ మెయిల్, దరఖాస్తు చేస్తున్న తేదీ, ఎంత రుణం కావాలి తదితర వివరాలను నర్సింగ్ నాయక్ తీసుకుంటున్నాడు. ఇతను వనపర్తి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రాత్లావత్ రమేశ్, ఇస్లావత్ రాములు అలియాస్ బాబు, కొత్తపల్లి ఉమేశ్, బోయ వీరేశ్లతో పాటు ఇద్దరు మైనర్లను పనికి పెట్టుకుని ఓ ఆఫీస్ రన్ చేస్తున్నాడు.

రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు వీరు పట్టణంలోని నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్లి ఫోన్ చేసి మీకు రుణం మంజూరైందని నమ్మిస్తారు. బీమా, టీడీఎస్, జీఎస్టీ, ఫైల్ క్లోజింగ్ ఛార్జెస్, ప్రాసెసింగ్ ఫీజ్, సర్సీస్ ఛార్జెస్ పేరుతో డబ్బులు వసూలు చేస్తారు. ఇలా ఇప్పటి వరకు 250 మంది లబ్ధిదారుల నుంచి ఒక్కొక్కరి చేత 20 వేలు నుంచి 40 వేలు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా 20 లక్షలు కాజేయడం గమనార్హం. రుణం మంజూరైనట్లు తప్పుడు డాక్యుమెంట్ పంపించి.. ఆ తర్వాత ఫోన్లను స్విచ్ఛాఫ్ చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. బాధితుల నుంచి కాజేసిన డబ్బులో రోహిత్‌కు 50 శాతం, నర్సింగ్ నాయక్ 25 శాతం, మిగతా డబ్బులను బృంద సభ్యులు పంచుకుంటున్నారని పోలీసులు తెలిపారు.

Also Read: అమ్మాయిల బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు..! గుడ్లవల్లేరు కాలేజీ యాజమాన్యం ఏమందంటే..?

నిందితులు తెలుగు మాట్లాడే వారినే టార్గెట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముద్ర, ధని లోన్స్ పేరుతో మోసాలు చేస్తున్నారని.. దరఖాస్తు దారులు ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు