అమ్మాయిల బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు..! కాలేజీ యాజమాన్యం ఏమందంటే..

గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రత్యేక విచారణ అధికారిగా గుడివాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ రమణమ్మను నియమించింది.

అమ్మాయిల బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు..! కాలేజీ యాజమాన్యం ఏమందంటే..

Gudlavalleru Engineering College Incident : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ బాత్రూమ్ లో హిడెన్ కెమెరాల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం స్పందించింది. గత 25 సంవత్సరాల నుంచి కాలేజీ నిర్వహిస్తున్నామని తెలిపింది. గత రాత్రి నుండి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని వెల్లడించింది. లేడీస్ హాస్టల్ బాత్ రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయా లేవా అనేది పోలీసులే తేల్చాలంది.

తమ కాలేజీలో క్రమశిక్షణతో కూడిన విద్యను బోధిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. విద్యార్థులు ఎందుకు ఇలా చేస్తున్నారో ఇప్పటికీ తమకు అర్థం కావటం లేదంది. తమ కాలేజీలో ఎలాంటి తప్పు జరగదని యాజమాన్యం తేల్చి చెప్పింది. ఏదైనా తప్పు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఆందోళన పడొద్దని కాలేజీ యాజమాన్యం సూచించింది.

విచారణ అధికారిగా గుడివాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సీఐ
గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రత్యేక విచారణ అధికారిగా గుడివాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ రమణమ్మను నియమించింది. విచారణ బృందంలో సర్కిల్ ఇన్ స్పెక్టర్ రమణమ్మతో పాటు ఐదుగురు మహిళా పోలీసులు ఉన్నారు. కాలేజీలోని లేడీస్ హాస్టల్ కి వెళ్లిన విచారణ బృందం తనిఖీలు చేసింది. విద్యార్ధుల నుంచి వివరాలు సేకరించింది.

రెండు రోజుల్లో పూర్తి దర్యాప్తు: మంత్రి కొల్లు రవీంద్ర 
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. దీనిపై రెండు రోజుల్లో పూర్తి దర్యాప్తు చేస్తామని, దీని వెనుక ఎంతటి వారున్న శిక్షిస్తామన్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారని ఆయన తెలిపారు. దీన్ని సీరియస్ గా తీసుకోవాలని, దర్యాప్తు వేగవంతం చేయాలని మంత్రులు, కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారని కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ ఘటనలో వెంటనే హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేసి చర్యలు తీసుకుంటామని స్టూడెంట్స్ కి కాలేజీ యాజమాన్యం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిందన్నారు. కాగా, ఈ ఘటనలో కాలేజీ యాజమాన్యం పాత్ర ఉన్నా సహించేది లేదని, వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర.

హాస్టల్‌ విద్యార్థులకు రెండు రోజుల సెలవు
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీలోని హాస్టల్‌ విద్యార్థులకు యాజమాన్యం రెండు రోజులు సెలవు ప్రకటించింది. హెడెన్ కెమెరాల వ్యవహారంపై విద్యార్థుల ఆందోళన, పోలీసుల విచారణ నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హాస్టల్ నుంచి విద్యార్థులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళుతున్నారు.

 

 

Also Read : గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. విచారణకు ఆదేశం

సీక్రెట్ కెమెరాలు లేవంటున్న పోలీసులు..!
గుడ్డవల్లేరులోని ఇంజినీరింగ్ కాలేజీని మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. విద్యార్థులెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరమన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉందన్నారు. ఇందుకోసం మహిళా పోలీసులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ బాత్రూమ్స్ లో సీక్రెట్ కెమెరాల కలకలంపైన విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. అయితే, అమ్మాయిల హాస్టల్ వాష్ రూమ్స్ లో ఎలాంటి హిడెన్ కెమెరాలు గుర్తించలేదని ఎస్పీ తెలిపారు. ఆరోపణలు వచ్చిన వారి ల్యాప్ ట్యాప్, మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పరిశీలించామని తెలిపారు. అయితే, నేరం రుజువయ్యేలా ఎలాంటి ఆధారం లభించలేదన్నారు. అమ్మాయిలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తప్పు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.