ముత్తూట్ ఫైనాన్స్ సంస్ధ ఎండీపై దాడి

  • Publish Date - January 7, 2020 / 11:59 AM IST

ప్రముఖ  బంగారం తాకట్టు వ్యాపార సంస్థ ముత్తూట్ ఫైనాన్స్  మేనేజింగ్ డైరెక్టర్  జార్జ్  అలెగ్జాండర్ ముత్తూట్ పై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.  ఈ ఘటనలో ఆయన తలకు, భుజానికి గాయమైంది. వెంటనే ఆయన్ను దగ్గరలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. జనవరి7, మంగళవారం ఉదయం9గంటల సమయంలో  ఆయన కొచ్చి లోని తన కార్యాలయానికి వెళుతుండగా  ఐజీ ఆఫీసు ఎదురుగా  ఈ సంఘటన జరిగింది.

దాడికి పాల్పడిన వారు సీఐటీయూ కి చెందిన కార్యకర్తలేనని ముత్తూట్ యాజమాన్యం ఆరోపించింది.  కాగా ఈ ఆరోపణలను సీఐటీయూ ఖండించింది. ఇలాంటి హింసాత్మక ఆందోలనలను తాము చేపట్టమని సీఐటీయూ నేత అనంతలవట్టమ్ ఆనందన్ చెప్పారు.  2019 డిసెంబర్ లోముత్తూట్ ఫైనాన్స్ సంస్ధ తన కంపెనీకి చెందిన 43 బ్రాంచిలను మూసివేస్తూ అందులోని 160 మంది సిబ్బందిని ఉద్యోగాల్లోంచి తొలగించింది.  అప్పటి నుంచి ఉద్యోగులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు.

లాభాలు రాని  బ్రాంచిలను మూసివేయటం వల్ల సిబ్బందిని తొలగించామని సంస్ధ చెపుతుండగా… ఉద్యోగులు అంతకు ముందు సమ్మెలో పాల్గోన్నందుకు యాజమాన్యం తొలగించిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కాగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి  టీకే రామకృష్ణన్ ముత్తూట్  యాజమాన్యం కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ దాడిపై పోలీసులతో సమగ్ర విచారణ జరపిస్తామని ఆయన చెప్పారు.

Also Read : బీజేపీలో చేరిన మోత్కుపల్లి నరసింహులు 

ముత్తూట్ పై దాడిని పారిశ్రామిక వేత్తలు ఖండించారు. ఇటువంటి దాడులు రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభావాన్నిచూపుతాయని పలువురు పారిశ్రామిక వేత్తలు వ్యాఖ్యానించారు. జనవరి 9-10 తేదీల్లో  కొచ్చిలో జరిగే ప్రపంచం పెట్టుబడిదారుల సమావేశానికి కొన్ని రోజులముందు ఈ సంఘటన జరగటం దురదృష్టకరమని వారు అన్నారు.  కొచ్చి ప్రధాన కేంద్రంగా వ్యాపారం చేస్తున్న ముత్తూట్ ఫైనాన్స్ సంస్ధ దేశవ్యాప్తంగా 6 వేలకు పైగా బ్రాంచిలను కలిగి ఉంది. ఇందులో 600 బ్రాంచిలు కేరళలోనే ఉన్నాయి.