ప్రేమించి పెళ్లి చేసుకున్న 15రోజులకే…

నందవరం మండల కేంద్రానికి చెందిన రాకేష్‌ గౌడ్‌ అనే వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన అనూష ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి అయిన 15 రోజులకే రాకేష్ ముఖం చాటేయడంతో బాధితురాలు అనూష శుక్రవారం ( ఆగస్ట్ 7, 2020)న భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం.. రాకేష్‌ గౌడ్‌, అనూష లకు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. గత నెల 4న ఇద్దరూ హైదరాబాద్‌లో పెళ్లి చేసుకుని అక్కడే కాపురం పెట్టారు.



అయితే రాకేష్ పెళ్లి అయిన 15 రోజుల తరువాత ఒసారి ఇంటికి వెళ్లోస్తానని చెప్పి వారం రోజులపాటు ఫోన్‌, మెసేజ్ ఏం చేయకపోవడంతో యువతి ఆందోళన చెంది నందవరం చేరుకుంది. అక్కడ రాకేష్ ని కలిసి మాట్లాడుతుంటే మన ఇద్దరి కులాలు వేరు కావడంతో మా తల్లిదండ్రులు పెళ్లిని అంగీకరించలేదు అంటూ రాకేష్ ముఖం చాటేశాడు.



దీంతో అనూష మహిళా సంఘాలతో కలిసి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించింది.