Cyber Crime: డీమార్ట్ ఆఫర్ అంటే ఆశపడ్డాడు.. కట్ చేస్తే లక్ష రూపాయలు కొట్టేశారు.. దిమ్మతిరిగే సైబర్ మోసం..

ఇలాంటి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఆఫర్ల పేరుతో మోసాలు జరుగుతున్నాయని, అలర్ట్ గా ఉండాలని చెప్పారు.

Cyber Crime: డీమార్ట్ ఆఫర్ అంటే ఆశపడ్డాడు.. కట్ చేస్తే లక్ష రూపాయలు కొట్టేశారు.. దిమ్మతిరిగే సైబర్ మోసం..

Updated On : December 8, 2025 / 1:07 AM IST

Cyber Crime: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని, అత్యాశను సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఆఫర్ పేరుతో ఓ పెద్దాయనను బురిడీ కొట్టించారు. ఏకంగా ఆయన బ్యాంక్ ఖాతా నుంచి లక్ష రూపాయలు కొట్టేశారు.

హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన 75ఏళ్ల వృద్ధుడు దారుణంగా మోసపోయాడు. సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాడు. హబ్సిగూడలో నివాసం ఉంటే వ్యక్తికి ఫేస్ బుక్ లో ఒక యాడ్ వచ్చింది. అందులో డీమార్ట్ ఆఫర్ అని ఉంది. ఆ ఆఫర్ కు పెద్దాయన అట్రాక్ట్ అయ్యాడు. దానిపై క్లిక్ చేశాడు. ఒక ఆన్ లైన్ ఫామ్ వచ్చింది. అందులో ఆయన తన వివరాలన్నీ సబ్మిట్ చేశాడు. ఆ తర్వాత ఆయన వాట్సాప్ కు ఒక ఏపీకే ఫైల్ వచ్చింది. దానిపై క్లిక్ చేశాడు. అంతే.. ఆయన ఫోన్ ని సైబర్ క్రిమినల్స్ హ్యాక్ చేసేశారు. ఆయన బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేయగలిగారు. అలా ఆయన బ్యాంకు ఖాతాల నుంచి లక్ష 9వేల రూపాయలు కొట్టేశారు. తాను మోసపోయానని తెలుసుకున్న వృద్ధుడు లబోదిబోమన్నాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

కాగా, ఇలాంటి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఆఫర్ల పేరుతో మోసాలు జరుగుతున్నాయని, అలర్ట్ గా ఉండాలని చెప్పారు. వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ఖాతాలకు ఏపీకే ఫైల్స్ వస్తే.. వాటిపై క్లిక్ చేయొద్దని సూచించారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.