తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హన్మకొండ చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు ప్రవీణ్ కు శిక్ష తగ్గించింది హైకోర్టు. ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది కోరు. చివరి శ్వాస
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హన్మకొండ చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు ప్రవీణ్ కు శిక్ష తగ్గించింది హైకోర్టు. ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది కోర్టు. చివరి శ్వాస వరకు ప్రవీణ్ ను జైల్లోనే ఉంచాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
2019 జూన్ 18న 9 నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు ప్రవీణ్, ఆపై పాపను హత్య చేశాడు. ఈ కేసును విచారించిన వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రవీణ్ కు ఉరిశిక్ష విధించింది. ఆగస్టు 7న తీర్పు ఇచ్చింది. కాగా, తనకు విధించిన ఉరిశిక్షను హైకోర్టులో సవాల్ చేశాడు ప్రవీణ్. కేసును విచారించిన కోర్టు నిందితుడికి విధించిన శిక్షను యావజ్జీవ ఖైదుగా సవరిస్తూ తీర్పిచ్చింది.
ఈ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ”ఉరి శిక్ష అమల్లో ఉన్న పలు దేశాలతోపాటు అది అమల్లో లేని దేశాల్లో ఉన్న నేరాల రేటుకు పెద్ద తేడా లేదు. అందువల్ల ఉరి శిక్షతో సమాజంలో భయాన్ని సృష్టించి నేరాలను తగ్గించాలన్న అభిప్రాయాలు సరికావు. ఉరి శిక్షపై మన దేశంలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి” అంటూ సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో వెలువరించిన మార్గదర్శకాలను హైకోర్టు డివిజన్ బెంచ్ వివరించింది.
ఉరికి మినహాయింపు ఉందని, యావజ్జీవ కారాగారం విధించవచ్చని, అత్యంత అరుదైన కేసుల్లోనే ఉరి శిక్ష విధించాలంటూ బచన్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపింది. నేరాన్ని అంగీకరించడమే పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లని తెలిపింది. నిందితుడు పాతికేళ్ల వాడు. వెనుకబడిన తరగతికి చెంది కూలీ. దొంగతనం తప్ప మరే తీవ్రమైన నేరానికి పాల్పడినట్లు ఆధారాల్లేవు. సంస్కరణకు అతీతంగా నిందితుడు ఉన్నట్లు ప్రాసిక్యూషన్ ఆధారాలు చూపలేకపోయిందని బెంచ్ అభిప్రాయపడింది. ఇలాంటి కేసుల్లో కోర్టులు మధ్యేమార్గాన్ని అనుసరించాల్సి ఉందని తెలిపింది. ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛకు హద్దు గీయడం అంటే జీవించే హక్కు లేకుండా చేయడం కాదని కోర్టు చెప్పింది.
వరంగల్ జిల్లా హన్మకొండలో తల్లి పక్కన నిద్రిస్తున్న 9 నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చిన ఘటన అందరిని కంటతడి పెట్టించింది. పోలెపాక ప్రవీణ్ (25) ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. హన్మకొండలో కూలి పనులు చేసే ప్రవీణ్ జూన్ 18న అర్ధరాత్రి మద్యం మత్తులో ఓ ఇంటి డాబాపైకి ఎక్కాడు. అక్కడ తల్లి పక్కన నిద్రిస్తున్న 9 నెలల చిన్నారిని ఎత్తుకెళ్లాడు. అనంతరం పసిపాపను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాప ఏడవడంతో నోరు, ముక్కు మూసి హతమార్చాడు. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. నిందితుడిని ఉరి తీయాల్సిందేనని ప్రజా, మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.
ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు 20 రోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేశారు. నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం, హత్య తదితర నేరాలతోపాటు లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసులు నమోదు చేశారు. 51 మంది సాక్షుల్లో 30 మందిని విచారించారు. కోర్టులో 20 పేజీల నేరారోపణ అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక న్యాయస్థానం 48 రోజుల్లోనే ఈ కేసులో తీర్పు ఇచ్చింది.
ఈ దుర్మార్గానికి పాల్పడిన ప్రవీణ్ కు ఉరేసరి అని న్యాయమూర్తి కె.జయకుమార్ సంచలన తీర్పు వెల్లడించారు. కాగా ఈ తీర్పును సమీక్షించిన హైకోర్టు నిందితుడు ప్రవీణ్ కు శిక్ష తగ్గించింది. శిక్ష తగ్గింపు పట్ల ప్రజా, మహిళా సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇలాంటి నీచుడిని ఉరి తీస్తేనే.. మృగాళ్లలో మార్పు వస్తుందని అంటున్నారు.