చిత్తుకాగితాలు కాదురా అవి : పాకిస్తాన్ ప్రింటింగ్ ప్రెస్ ల్లో భారత నోట్ల ముద్రణ

  • Publish Date - March 21, 2019 / 03:25 AM IST

నోటు అంటే మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం.. అదే నోటు కోసం 24 గంటలూ కష్టపడతాం.. ఎవరైనా నోట్లు ఇస్తే మంచివో కాదో చెక్ చేసుకుంటాం.. అలాంటిది పాకిస్తాన్ మాత్రం భారత్ తో ఆర్థిక యుద్ధానికి దిగింది. పాకిస్తాన్ లోని పెండ్లికార్డులు ప్రింట్ చేసే ప్రింటింగ్ ప్రెసుల్లో భారత నోట్లను ఇష్టానుసారం ప్రింట్ చేస్తున్నారు. ఈ నకిలీ కరెన్సీని మన దేశంలోకి పంపిస్తోంది. పాక్ నిఘా సంస్ధ ఐఎస్ఐ ఇందుకోసం ప్రత్యేకంగా ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసినట్లు భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. 
Read Also : అరవకండి.. ఓటేయండి.. సీఎం కాదు.. పీఎం కూడా అవుతాడు

2019 ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ లో దొరికిన నకిలీ కరెన్సీ పాకిస్తాన్ లో ప్రింటింగ్ చేయబడి, బంగ్లాదేశ్ మీదుగా వెస్ట్ బెంగాల్ కు వచ్చినట్లు గుర్తించారు. పాకిస్తాన్ లోని బలూచిస్తాన్లో ఉన్న క్వెట్టాలో ప్రత్యేకంగా భారత్ పవర్ ప్రెస్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇక్కడ ప్రింట్ అయ్యే నోట్లు ఒరిజినల్ వాటిని తలదన్నేలా ఉన్నాయని తెలుస్తోంది. అసలు నోట్లపై ఉండే భద్రతా ప్రమాణాలను మాత్రం పాక్ కాపీ చేయలేకపోయింది. 

భారత్ సరిహద్దులో నిఘా పెరిగి పోవడంతో పాకిస్తాన్ నకిలీ కరెన్సీ రవాణాకు కొత్త మార్గాలు వెతుకుతోంది. గతంలో విమానాల ద్వారా దుబాయ్, సౌదీ అరేబియాకు తరలించి అక్కడ్నించి ఓడల ద్వారా ఏజెంట్ల సహకారంతో, గుజరాత్, మహారాష్ట్రల్లోని ఓడరేవుల ద్వారా భారత్ లో ప్రవేశపెట్టేవారు. ప్రస్తుతం ఈమార్గం ద్వారా తీసుకు రావటం కష్టంగా మారటంతో పాక్ రూట్ మార్చింది.

క్వెట్టాలో ప్రింట్ చేసిన భారత నకిలీ కరెన్సీని రాజధాని కరాచీకి తరలిస్తారు. అక్కడ్నించి విమానాల ద్వారా బంగ్లాదేశ్ కు తరలిస్తారు. అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాకు తీసుకువచ్చి, ఏజెంట్ల ద్వారా చెలామణి చేయిస్తోంది. 

కరాచీ నుంచి కరెన్సీని భారత్ లో చలామణీ చేసేందుకు పాక్ వివిధ దశల్లో ఏజెంట్లకు కమీషన్లు చెల్లిస్తోంది. హైదరాబాద్ చేరే నకిలీ కరెన్సీ రేటు 1:3గా ఉంటుంది. అంటే అసలు 30 వేల రూపాయల అసలు నోట్లు ఇస్తే, ఏజెంట్లు లక్ష రూపాయల నకిలీ కరెన్సీ ఇచ్చేవారు. ఇటీవల ఈ ఏజెంట్లకు ఇచ్చే కమీషన్ కూడా పెరిగినట్లు పోలీసులు చెపుతున్నారు. నోట్లు పక్కాగా ముద్రిస్తున్నందున ఈ కమీషన్ పెంచినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలో చిక్కిన నకిలీ కరెన్సీ కేసులో అరెస్టైన గౌస్ కు, మాల్దాకు చెందిన బబ్లూ 50 వేల రూపాయలు అసలు నగదుకు లక్ష రూపాయల నకిలీ నోట్లు ఇచ్చినట్లు తెలిసింది. ఇలా వచ్చే నిధులకు పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు తెలిసింది.

హైదరాబాద్ పాతబస్తీలో నకిలీ కరెన్సీ మార్పిడి చేస్తూ అరెస్టైన పండ్ల వ్యాపారి గౌస్ 1991లో బాంబులతో పట్టుబడ్డాడు. ఇతడిపై పోలీసులు అప్పట్లో టాడా కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత 2011 నుంచి గౌస్ నకిలీ కరెన్సీ దందా ప్రారంభించాడు. వెస్ట్ బెంగాల్ నుంచి పలు మార్గాల్లో నకిలీ కరెన్సీని హైదరాబాద్ తెప్పించి చెలామణి చేయటం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే వెస్ట్ బెంగాల్ లోని మాల్దాలో ఉన్న కృష్ణాపూర్ ప్రాంతానికి చెందిన అమీనుల్ రెహ్మాన్, ఎలియాస్ బబ్లూతో పరిచయం పెరిగింది. బబ్లూకు 40 వేలు అసలు నగదు చెల్లించి లక్ష రూపాయల నకిలీ కరెన్సీని తెప్పించి చలామణీ చేసేవాడు. బబ్లూ, గౌస్ తో పాటు పలువురికి నకిలీ కరెన్సీ సరఫరా చేస్తేన్నట్లు గుర్తించిన పోలీసులు  బబ్లూ కోసం గాలిస్తున్నారు.  
Read Also : ఆనందం ఎక్కడ.. ఎప్పుడూ ఏడుపే : ఇంకా దిగజారిన ఇండియా