Komarambheem Asifabad
Komarambheem Asifabad : రోజు రోజుకు మానవత్వం మంటగలిసిపోతోంది. కొంతమంది కాసుల కోసం కక్కుర్తిపడుతున్నారు. డబ్బులు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అక్రమ సంపాదన కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తెలంగాణలో దారుణానికి తెగబడ్డారు. బీమా డబ్బుల కోసం ఏకంగా బతికున్న వ్యక్తినే చనిపోయినట్లుగా సృష్టించారు. బతికి ఉన్నా చనిపోయినట్లుగా ఆన్ లైన్ లో నమోదు చేసి వ్యక్తి బీమా డబ్బులు కాజేశారు.
తీరా విషయం సదరు వ్యక్తికి తెలిసి లేబర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. కొమరంభీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన కోట రాజన్న 2018లో కాగజ్ నగర్ లోని లేబర్ కార్యాలయంలో లేబర్ గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో లేబర్ కార్డు రెన్యూవల్ కోసం మార్చి6న స్థానిక మీ సేవా కేంద్రానికి వెళ్లాడు.
అయితే సహజమరణం పొంది డబ్బు కూడా తీసుకున్నట్లు ఆన్ లైన్ లో చూపడంతో అతడు షాకయ్యాడు. లేబర్ కార్డు రెన్యూవల్ చేయడంతోపాటు పూర్తి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సదరు వ్యక్తి సోమవారం లేబర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. గతంలో కూడా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మరో వ్యక్తి తన కాళ్లను తానే నరుక్కున్నాడు.